రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అక్టోబర్ 23న రాధే శ్యామ్ మూవీ నుండి మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అందమైన ప్రకృతి వనంలో పొగలు కక్కుకుంటూ వెళుతున్న రైల్ లో రొమాంటిక్ పోజ్ లో ఉన్న పూజ, ప్రభాస్ లను చూపించగా మోషన్ పోస్టర్ అందరినీ బాగా ఆకట్టుకుంది. ప్రేమకు చిరునామా, త్యాగాని నిదర్శనంగా చెప్పుకొనే రోమియో-జూలియట్, సలీం-అనార్కలి, దేవదాసు-పార్వతిలను చూపించడం ద్వారా సినిమా కథపై మరింత ఆసక్తి పెంచివేశారు. 

విశేష ఆదరణ దక్కించుకుంటూ మోషన్ పోస్టర్ 25 మిలియన్ క్యుమిలేటివ్ వ్యూస్ దక్కించుకోవడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాధే శ్యామ్ మూవీతో ప్రభాస్ సరికొత్త రికార్డ్స్ నమోదు చేయడం ఖాయం అంటున్నారు. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. సెన్సిబుల్ అండ్ సీరియస్ లవ్ స్టోరీగా రాధే శ్యామ్ తెరకెక్కుతుంది. 

1960ల కాలంలో ఇటలీలో నడిచే ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ విక్రమాదిత్య, పూజ ప్రేరణ పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ఇటలీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా వచ్చే ఏడాది విడుదల కానుంది. రాధే శ్యామ్ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.