ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి తెరకెక్కించిన 'మార్కెట్ లో ప్రజాస్వామ్యం' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నారాయణమూర్తి చిత్రాలు విప్లవాత్మక భావజాలంతో ఉంటాయి. నారాయణమూర్తి కూడా నిత్యం ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలు తెలియజేస్తుంటారు. 

మార్కెట్ లో ప్రజాస్వామ్యం చిత్ర విజయయోత్సవ యాత్రని ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నారాయణమూర్తి విజయనగరంలోని సప్తగిరి థియేటర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికల్లో ఏం జరుగుతోందో కళ్ళకు కట్టినట్లు చూపించానని నారాయణమూర్తి అన్నారు. 

ఎన్నికల వ్యవస్థ ఎలా తయారైందో ఈ చిత్రంలో చూపించా. ఎన్నికల తర్వాత రాజకీయనాయకులు పార్టీలు ఎలా ఫిరాయిస్తున్నారో కూడా ఈ చిత్రంలో ప్రధానంగా చూపించినట్లు నారాయణమూర్తి అన్నారు. ఇండియాలో ప్రజాస్వామ్యం గాడితప్పి ధనస్వామ్యంగా మారింది. 

ఈ సందర్భంగా నారాయణమూర్తి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించారు. తన పార్టీలోకి వచ్చే నేతలు తమ పదవులకు రాజీనామా చేసి రావాలని సీఎం జగన్ చెప్పడం చాలా గొప్ప విషయం. కొంతమంది నేతలు పదవులు అనుభవిస్తూనే పార్టీలు మారుతున్నారు. ఈ విషయంలో వైయస్ జగన్ ని తాను అభినందిస్తునట్లు నారాయణమూర్తి అన్నారు.