Asianet News TeluguAsianet News Telugu

దాసరి సంతాప సభలో శివమెత్తిన ఆర్ నారాయణ మూర్తి..ఎవడబ్బ సొమ్మది?

  • తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు సంతాప సభ
  • అవార్డుల ప్రకటనలో కేంద్రం వివక్ష చూపుతోందన్న ఆర్ నారాయణమూర్తి
  • దాసరికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేలా కృషి చేద్దామని పిలుపు
R narayana murthy fire on centre for bias in awards

తెలుగు సినిమా పరిశ్రమ తరపున దర్శకరత్న దాసరి నారాయణ రావు సంతాప సభ నిర్వహించారు. ఈ సభలో ప్రముఖ నటుడు దర్శక నిర్మాత అయిన ఆర్.నారాయణ మూర్తి ఎంతో ఉద్వేగంతో ప్రసంగించారు. దాసరి గొప్పతనం వివరించిన నారాయణమూర్తి.. దాసరి తన సాయం కోరిన అందరికీ ఎలా సాయపడ్డారో వివరించే ప్రయత్నం చేశారు.

 

సినిమా హీరో కావాలని కలలుగని చెన్నైకి 70రూపాయలతో వెళ్లానని.. అక్కడికి వెళ్లాక సినిమా కష్టాలు ఏంటో తెలిసాయన్న నారాయణమూర్తి.. రాజబాబుగారి మేకప్ మేన్ చిన్నిగారు చెన్నై మహాలింగ పురంలో ఓ కారు షెడ్డులో ఆశ్రయం ఇచ్చి విక్రమ్ స్టూడియోకు తీసుకుని వెళ్లారు. అక్కడ గురువుగారి డైరెక్షన్లో తాత మనవడు షూటింగ్ జరుగుతోంది. అపుడు నేను బొమ్మలు వేసేవాన్ని. నాగేశ్వరరావుగారి బొమ్మేసి గురువుగారు రాగానే చూపించాను. అపుడు ఆయన... తమ్ముడు నైస్.. అని నా భుజం తట్టాడు. గురువుగారు చేయి వేయగానే ఆయనలోని మానవీయ కోణానికి శిరస్సు వంచి దండం పెట్టాను. నన్ను ఏం చేస్తున్నావని అడిగారు. ఇంటర్మీడియట్ అయిపోయింది సార్, నేను హీరో అవ్వాలి సార్, నాకు సినిమా అంటే పిచ్చి అన్నాను. అపుడు ఆయన బిఏ పూర్తి చేసుకుని రా.. నీకు తప్పకుండా వేషం ఇస్తాను అన్నారు. నేను బిఏ పాసై సినిమా ఇండస్ట్రీకి వెళితే.. మాట తప్పకుండా వేషం ఇచ్చారు. ‘నేడు' అనే సినిమాలో కృష్ణగారి అబ్బాయి రమేష్ బాబుగారు హీరో అయితే నాకు సెకండ్ హీరోగా ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా 110 రోజులు చాలా బ్రహ్మాండంగా ఆడింది అని ఆర్ నారాయణ మూర్తి తెలిపారు.

 

మద్రాసు వెళ్లిన నన్ను నీ కులం ఏమిటి? నీ మతం ఏమిటనిగానీ, అసలునువ్వు ఎవరు అని గాని ఏమీ అడగకుండా... దాసరి కేవలం నాలోని పిచ్చిని గమనించి ఈ రోజు నన్ను మీ ముందు నటుడిగా నిలబడేలా చేశారు. ఆ మహానుభావుడికి శిరస్సు వంచి దండం పెడుతున్నాను. నన్నే కాదు నాలా చాలా మందికి ఆయన జీవితాన్ని ఇచ్చారు అని నారాయణ మూర్తి తెలిపారు. ఆయన సినిమా దర్శకుడిగా, నటుడిగా సక్సెస్ అయ్యారు. పత్రిక అధిపతిగా తన సత్తా చాటారు. రాజకీయ నాయకుడిగా కూడా ఎంతో సేవ చేశారు అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు.

 

పెద్దలారా... ఈరోజుల్లో ఒక పది కోట్లు ఉంటే హీరో అవ్వొచ్చు. వారసత్వంలో కూడా తప్పేమీ లేదు. వాళ్లు హీరోలు అవ్వొచ్చు... అవ్వాలికూడా. అందరూ అవ్వాలి. అయితే సినిమాలో ఎంటరవ్వాలనే యాంబిషన్ డబ్బున్న వాడిది మాత్రమే కాదు. మా లాంటి పేద వారందరికీ యాక్టర్లు అవ్వడానికి, టెక్నీషియన్లు అవ్వడానికి, డైరెక్టర్లు అవ్వడానికి మా గురువు దాసరి నారాయణ రావుగాను ఎలాగైతే అంబెడ్కర్ లా కృషి చేశారో... అలా ఇప్పుడు వస్తున్న గొప్ప గొప్ప దర్శకులు, నిర్మాతలు కూడా సామాన్యులు ఎవరైనా వస్తే కూడా దయచేసి వాళ్లకి కూడా వేషాలు ఇస్తూ వారి యాంబిషన్ తీరుస్తూ... దాసరి నారాయణ రావుకు అసలు సిసలు నివాళి ఇవ్వాల్సిందిగా..., పెద్దలు చిరంజీవిగారు, అల్లు అరవింద్ గారు, గంటా శ్రీనివాసరావు గారి లాంటి పెద్దలను కోరుతున్నాను.. అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు.

 

భారత రత్న అవార్డు అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఇచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మన గురువు గారు దాసరి నారాయణ రావు గారికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు, ఫిల్మ్ చాంబర్ రికమండ్ చేసి దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇప్పించాలి అని నారాయణ మూర్తి కోరారు. ఈ రోజుల్లో అవార్డులను కూడా లాబీయింగ్ చేసుకోవాల్సి వస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా తెలుగు నుండి పద్మభూషణ్ రాలేదు. దాసరి నారాయణ రావు గారి విషయంలో రికమండ్ చేయాల్సిందే. విద్యా బాలన్ కు పద్మశ్రీ ఒక సినిమాతో ఇచ్చేశారు. సావిత్రి లాంటి మహా నటిని ఈ ప్రపంచంలో మనం చూశామా? ఎస్వీ రంగా రావుగారి లాంటి మహానటుడిని ఈ ప్రపంచంలో చూశామా? వాళ్లకి పద్మశ్రీలు లేవు. ఎంత దుర్మార్గమండీ ఇది అని నారాయణ మూర్తి అన్నారు.

 

దాసరి నారాయణ రావుగారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేలా చేయాలి. అంతా కలిసి ఢిల్లీ వెళదాం. సౌతిండియా, నార్త్ ఇండియా ఫైట్ రావాల్సిందే. ఎవడబ్బ సొమ్ము ఇది. ఎవడబ్బ సొమ్ము భాయ్? అన్నీ వాళ్లకేనా? ఇండియా అంటే నార్త్ ఇండియానా? అంటూ ఆర్ నారాయణ మూర్తి ఉద్వేగంగా ప్రసంగించారు.

Follow Us:
Download App:
  • android
  • ios