pushpa: 'పుష్ప' ప్రమోషన్ కోసం పెద్ద స్కెచ్ వేసారే
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో బలమైన కథను 'పుష్ప' పేరుతో రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొత్తం 5 భాషల్లో రిలీజ్ కానుండటం విశేషం.
సినిమా తియ్యటం ఒకెత్తు...దాన్ని జనాల్లోకి తీసుకెళ్లటం మరొక ఎత్తు. ఈ విషయాలు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీతో ప్రయాణం చేస్తూ వస్తున్న అల్లు అర్జున్ కు తెలియంది కాదు. అందుకే తన తొలి పాన్ ఇండియా సినిమా 'పుష్ప' ప్రమోషన్ కోసం సుకుమార్ తో కలిసి ఓ కొత్త స్కెచ్ వేసారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అది బాగా క్లిక్ అవుతుందని మీడియా వర్గాలు అంటున్నాయి. ఇంతకీ ఏమిటా స్కెచ్..?
సుకుమార్ దర్శకత్వంలో విభిన్న కథాంశం రూపొందుతున్న చిత్రం 'పుష్ప'. అల్లు అర్జున్- రష్మిక మందన హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాను డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎప్పుడు ఎక్కడ నిర్వహించనున్నారు? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. అందుతున్న సమాచారం మేరకు ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులోనే నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
డిసెంబర్ 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. దాదాపు అదే డేట్ ఖరారు కావొచ్చునని అంటున్నారు. ఇక ఈ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా పలువురు టాప్ స్టార్స్‌ని గెస్టులుగా ఆహ్వానిస్తున్నారట సుకుమార్. పక్కాగా స్కెచ్చేసి రంగంలోకి దూకుతున్న ఆయన, పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ మునుపెన్నడూ చూడనంత గ్రాండ్‌గా జరగాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రభాస్ ని ఆహ్వానించారని చెప్పుకుంటున్నారు. ఈ మధ్యనే పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన "రొమాంటిక్" సినిమా కోసం బాగా ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రభాస్ అల్లుఅర్జున్ "పుష్ప" కోసం ఈ వేడుకకి హాజరు అవుతానని హామీ ఇచ్చారట. ప్రభాస్ సీన్ లోకి వచ్చారంటే ఖచ్చితంగా బాలీవుడ్ మీడియా నుంచి ఓ రేంజిలో మైలేజీ దొరుకుతుంది. దాంతో ప్రమోషన్ ఈజీ అయ్యిపోతుందని టీమ్ భావిస్తోందిట.
ఇదిలా ఉండగా పుష్ప చిత్ర బృందం ఈ సినిమాకు కేరళ లో కూడా భారీ విడుదలని ప్లాన్ చేస్తోందట. తాజా సమాచారం ప్రకారం కేవలం కేరళలో మాత్రమే పుష్ప విడుదల తేదీన 40 ఫ్యాన్ షో లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీటికి సంబంధించిన టికెట్ బుకింగ్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇక అల్లు అర్జున్ కోసం మాత్రమే కాకుండా ఈ సినిమాలో మలయాళం స్టార్ ఫాహాధ్ ఫాసిల్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుండడంతో ఈ సినిమాకి మలయాళంలో కూడా బాగానే క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 17వ తారీఖున తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.