ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీలో పెర్ఫామెన్స్ కి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కైవసం చేసుకున్నాడు. దీనితో అల్లు కాంపౌండ్ లో సంబరాలు మొదలయ్యాయి.
కొద్ది సేపటి క్రితమే భారత ప్రభుత్వం 69 వ జాతీయ అవార్డులని ప్రకటించింది. ఊహించినట్లుగానే తెలుగు సినిమా జాతీయ అవార్డుల్లో సత్తా చాటింది. ఉప్పెన ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఇక అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం జాతీయ అవార్డుల్లో సైతం హవా కొనసాగించింది.
ఏకంగా ఆరు జాతీయ అవార్డులని కొల్లగొట్టింది. జాతీయ అవార్డుల్లోసంచలనం సృష్టించిన మరో తెలుగు చిత్రం పుష్ప. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీలో పెర్ఫామెన్స్ కి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కైవసం చేసుకున్నాడు. దీనితో అల్లు కాంపౌండ్ లో సంబరాలు మొదలయ్యాయి.
పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో అదరగొట్టేశాడు. ఊరమాస్ డైలాగ్ డెలివరీ మాత్రం కాదు బన్నీ బాడీ లాంగ్వేజ్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఎర్ర చందనం స్మగ్లర్ పాత్రలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా పెర్ఫాన్స్ తో కేక పెట్టించాడు. బన్నీ ఉత్తమ నటుడిగా గెలవడంతో ఫ్యాన్స్, టాలీవుడ్ సెలెబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు.
అల్లు అర్జున్ జాతీయ అవార్డుకి అర్హుడు అంటూ అంతా ప్రశంసిస్తున్నారు. పుష్ప చిత్రం కోసం అల్లు అర్జున్ ప్రాణం పెట్టి నటించాడని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్ నటనకి జాతీయ అవార్డు ఒక మణిహారం లాంటిది అని అంటున్నారు. బన్నీ జాతీయ అవార్డు గెలవడంతో పుష్ప 2 పై అంచనాలు మరో స్థాయికి చేరుతాయి అని చెప్పడం లో సందేహం లేదు.
ఇదిలా ఉండగా బన్నీ నేషనల్ అవార్డు గెలవడంతో.. అల్లు ఫ్యామిలీ, పుష్ప టీం మొత్తం ఒక్క చోట చేరారు. జాతీయ అవార్డుల ప్రకటన రాగానే డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ ని గట్టిగా కౌగిలించుకున్నారు. ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. సుకుమార్ అయితే సంతోషం పట్టలేక కంటతడి పెట్టుకున్నారు కూడా.
ఇక అల్లు అర్జున్ పిల్లలు, భార్య అల్లు స్నేహ, అల్లు అరవింద్ అక్కడే ఉంది ఆ సంతోష క్షణాలని ఆస్వాదించారు. ఇక పుష్ప నిర్మాతలు నవీన్, రవిశంకర్ కూడా ఆనందంలో మునిగిపోయారు. అల్లు అరవింద్ పుష్ప నిర్మాతలని అభినందించారు. ఇదంతా పక్కనే చూస్తూ ఉన్న అల్లు స్నేహ చప్పట్లు కొడుతూ అందరిని అభినందించింది. పుష్ప చిత్రానికి గాను దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు గెలవడం విశేషం. ఈ రెండు అవార్డులతో పుష్ప 2 కోసం చిత్ర యూనిట్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది అని చెప్పడం లో సందేహం లేదు.
