దర్శకుడు పూరి జగన్నాథ్ కి ఛార్మితో ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. ఛార్మి నిర్మాతగా మారి పూరి ఆఫీస్ లోనే వర్క్ చేస్తోంది. సినిమాపై పెట్టుబడి పెట్టడంతో పాటు కాస్టింగ్, మిగిలిన వ్యవహారాలు చూసుకుంటూ బిజీగా గడుపుతోంది. గతేడాది పూరి రూపొందించిన 'మెహబూబా' సినిమాపై కూడా ఛార్మి డబ్బులు పెట్టింది.

ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆర్థికంగా కొంత నష్టపోయింది. అయినప్పటికీ ఇప్పుడు పూరి డైరెక్ట్ చేసిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ప్రాజెక్ట్ సెట్ చేసింది ఛార్మి. పూరి తీస్తోన్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుండడంతో అతడితో కలిసి పని చేయడానికి హీరోలు వెనుకాడుతున్న సమయంలో రామ్ డేట్స్ తీసుకురావడంలో ఛార్మి కీలకపాత్ర పోషించింది.

అలానే సినిమాను ఆకున్న బడ్జెట్ లో తీయడానికి తనవంతు మేనేజ్మెంట్ చూపించింది. ఈ సినిమాకి బిజినెస్ పరంగా క్రేజ్ రావడంతో రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. దీంతో 'మెహబూబా' సినిమాతో ఛార్మి పోగొట్టుకున్న మొత్తం ఆమెకి తిరిగి వచ్చేసింది. గతంలో సినిమాల పరంగా ఆర్థికంగా కొంత నష్టపోయిన పూరి.. ఛార్మి కారణంగా ఎలాంటి టెన్షన్ లేకుండా పనిచేసుకోగలుగుతున్నారట.

ఆర్ధిక లావాదేవీలన్నీ ఛార్మి చూసుకోవడంతో పాటు షూటింగ్ లో అనవసరపు ఖర్చులు కాకుండా చూసుకుంటుందట. దీంతో పూరి తన నష్టాల నుండి కొద్దిగా తేరుకున్నట్లు తెలుస్తోంది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా గనుక హిట్ అయితే.. ఇండస్ట్రీలో మరోసారి పూరి క్రేజ్ పెరగడం ఖాయం.