హీరో రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. ఇది ఇలా ఉండగా.. ఆ మధ్య ఈ సినిమాకు సంబంధించి ఓ వివాదం బాగా నడిచింది.

సినిమా కథను ఓ వెబ్ సైట్ లో పెట్టేశారు. ఆ తరువాత యూనిట్ కి బ్లాక్ మెయిల్ కాల్స్ కూడా వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై దర్శకుడు పూరి జగన్నాథ్ స్పందించాడు. ''ఇస్మార్ట్ శంకర్ స్క్రిప్ట్ మాకు తెలుసు.. మాకు డబ్బులు ఇవ్వండి.. లేకపోతే బయటపెట్టేస్తాం అంటూ కొంతమంది బ్లాక్ మెయిల్ చేశారు. దీనిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం.. ఓ వెబ్ సైట్ లో వచ్చిన కథను కూడా తొలగించాం. ప్రొడ్యూసర్ గా మారిన తరువాత ఇలాంటి కష్టాలు తప్పవు. ఆ సమస్యలన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోయాయి'' అంటూ చెప్పుకొచ్చాడు.

మరోపక్క తన సినిమా క్లిప్పింగ్స్ ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అవ్వడంపై పూరి తన ఆవేదన వ్యక్తం చేశాడు. బయట షూటింగ్స్ చేస్తున్నప్పుడు అలాంటివి తప్పవని.. ఇండియన్స్ ని మార్చలేమని అన్నారు. 

చార్మినార్ లో షూటింగ్ చాలా ఇబ్బంది పెట్టిందని.. ఇండియాలో పబ్లిక్ ప్లేస్ లో షూటింగ్ ఎప్పుడూ కష్టమేనని.. చార్మినార్ లాంటి ప్లేస్ లో ఇంకా కష్టమని అన్నారు. వందల మంది ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తుంటారని ఇండియన్స్ అంతా ఇంతేనని అన్నారు.