టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌..మరో భారీ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం రెండు పాన్‌ ఇండియాచిత్రాల్లో బిజీగా ఉన్న ఆయన ఆ తర్వాత అంతర్జాతీయ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. 

డేరింగ్‌, డాషింగ్‌, డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌(Puri Jagannadh). సాధారణ హీరోగా మాస్‌ హీరోగా ఆవిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి. అంతేకాదు ప్రతి ఒక్క హీరో కూడా పూరీ డైరెక్షన్‌లో చేయాలని కోరుకుంటారు. సక్సెస్‌, ఫెయిల్యూర్‌కి అతీతంగా పూరీ డైరెక్షన్‌లో సినిమా చేస్తే హీరో రేంజ్‌ పెరుగుతుందనే టాలీవుడ్‌లో వినిపించే టాక్‌. అయితే వరుస పరాజయాల అనంతరం పూరీకి `ఇస్మార్ట్ శంకర్‌` రెడ్‌బుల్‌ లాంటి ఎనర్జీనిచ్చింది. దీంతో రెట్టింపు ఎనర్జీతో దూసుకుపోతున్నారు. 

ప్రస్తుతం ఆయన విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda)తో `లైగర్‌`(Liger) చిత్రం చేస్తున్నారు. ముంబయి చాయ్‌ వాలా ఏకంగా వరల్డ్ బాక్సర్‌గా ఎదగడం నేపథ్యంలో సాగే చిత్రమిది. పాన్‌ ఇండియాగా దీన్ని తెరకెక్కిస్తుండగా, ఇందులో బాలీవుడ్‌ భామ అనన్య పాండే కథానాయికగా నటిస్తుంది. ఇందులో వరల్డ్ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ కీ రోల్‌ పోషిస్తుండటంతో సినిమా రేంజ్‌ మారిపోయింది. ఈ చిత్రం ఆగస్ట్ 25న విడుదల కాబోతుంది. 

ఇదిలా ఉంటే ఇప్పటికే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని ప్రకటించారు పూరీ. విజయ్‌ దేవరకొండతో `జనగణమన`(Janaganamana) చిత్రం చేయబోతున్నట్టుతెలిపారు. ఇది కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు పూరీ మరో సెన్సేషనల్‌ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. అయితే ఇది పాన్‌ ఇండియా చిత్రం కాదు, పాన్‌ వరల్డ్ అని తెలుస్తుంది. `జనగనమన` అనంతరం ఇంటర్నేషనల్‌ సినిమా(Puri International Movie) చేయబోతున్నారట పూరీ. 

ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. ఇందులో అంతర్జాతీయ తారాగణం ఉంటుందట. టెక్నీషియన్లు కూడా విదేశాలకు చెందిన వారే ఉంటారని తెలుస్తుంది. అయితే ఈ చిత్రాన్ని కూడా తన పూరీ కనెక్ట్, పూరీజగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకాలపైనే నిర్మించబోతుండటం విశేషం. ప్రస్తుతం ఈ వార్త అన్ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతుంది. `లైగర్‌` రిలీజ్‌కి ముందే పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. ఆ మధ్య విడుదలైన టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. భారీ అంచనాలను పెంచింది. దీంతో తనపై తనకు కాన్ఫిడెంట్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌పై పూరీ కన్నేసినట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.