ఈ మధ్యకాలంలో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా.. దర్శకనిర్మాతలు మాత్రం విపరీతంగా ప్రమోషన్స్ చేస్తూ జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే హీరోలు మాత్రం తమ సినిమా రిజల్ట్ కి సంబంధించి ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ ఇలా చాలా మంది హీరోలు అనుకున్న రిజల్ట్ రాలేదనో.. కథ విషయంలో తప్పు చేశామనో ముందే ఒప్పేసుకుంటున్నారు.

అయితే ఇలాంటి స్టేట్మెంట్స్ దర్శకనిర్మాతలకు తలనొప్పులు తీసుకొస్తున్నాయి. థియేటర్ లో సినిమా ఆడుతుండగా.. ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదనేది వాళ్ల ఫీలింగ్. తాజాగా శర్వానంద్ కూడా ఇలానే నిజాల్ని ఒప్పేసుకొని ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. శర్వా హీరోగా నటించిన 'రణరంగం' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది.

రివ్యూల్లో కనీసం ఏవరేజ్ అని కూడా రాయలేదు. దానికి తగ్గట్లే వసూళ్లు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో కథ లేదని.. ఆ విషయం తనకు కూడా తెలుసునని.. స్క్రీన్ ప్లే నచ్చి సినిమా ఒప్పుకున్నట్లు కానీ అనుకున్న రిజల్ట్ రాలేదని శర్వా ఇటీవల ప్రెస్ మీట్ లో చెప్పాడు. శర్వా నిజాయితీగా ఈ స్టేట్మెంట్ ఇచ్చినా.. దర్శకనిర్మాతలకు మాత్రం అది నచ్చడం లేదు.

థియేటర్ లో సినిమా ఉండగా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ఎందుకంటూ మండిపడుతున్నారు. శర్వా స్టేట్మెంట్ల ప్రభావంతో నిజంగానే ఆదివారం నాడు సినిమా కలెక్షన్స్ తగ్గాయి. దీంతో శర్వాపై దర్శకనిర్మాతలు అలిగారని.. కానీ అవేవీ పట్టించుకోకుండా శర్వా తన కొత్త సినిమా పనుల్లో బిజీ అయిపోయాడని సమాచారం.