కోలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత వి ఏ దురై తుదిశ్వాస విడిచారు.  

వి ఏ దురై సూర్య-విక్రమ్ హీరోలుగా పితామగన్ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రానికి బాలా దర్శకుడు. తెలుగులో శివపుత్రుడు గా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. హీరో విక్రమ్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. అలాగే ఎన్నమ్మ కన్ను, లవ్లీ, ఆలు, లూటీ, గజేంద్ర చిత్రాలను ఆయన నిర్మించారు. అయితే వి ఏ దురై ఆర్థికంగా నష్టపోయారు. కొన్నాళ్లుగా కనీసం వైద్యానికి డబ్బుల్లేక ఇబ్బందిపడుతున్నారు.

ఆ మధ్య తనను ఆదుకోవాలని ఓ వీడియో విడుదల చేశారు. హీరో సూర్య వి ఏ దురైకి సహాయం చేశారు. డయాబెటిస్ తో బాధపడుతున్న ఆయన ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో విఏ దురై చెన్నై వలసరవాక్ లో గల తన నివాసంలో కన్నుమూశారు. 

69 ఏళ్ళ విఏ దురైకి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు, రెండో భార్యకు ఓ కుమార్తె. విఏ దురై మరణవార్త కోలీవుడ్ లో విషాదం నింపింది. పలువురు చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం.