`గుంటూరు కారం` సాంగ్‌ల విషయంలో మహేష్‌ సైతం అసంతృప్తితో ఉన్నాడని, దర్శక, నిర్మాతలకు ఆయన దీనిపై హెచ్చరిక కూడా చేశారని సమాచారం. ఓ వైపు ఈ విషయం రచ్చ అవుతుంది. 

`గుంటూరు కారం` సినిమాకి సంబంధించి తరచూ ఏదో విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అవి పాజిటివ్‌ కంటే నెగటివ్‌ వార్తలే ఎక్కువగా ఉండటం గమనార్హం. మొదట్లోనే షూటింగ్‌ ఆగిపోవడం, యాక్షన్‌ సీన్లు సరిగా రాకపోవడంతో మహేష్‌ బాబు అభ్యంతరం తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత మహేష్‌ ఫ్యామిలీలో చోటు చేసుకున్న వరుస విషాదాల కారణంగా కొన్ని రోజులు సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. 

ఆ తర్వాత టెక్నీషియన్లని మారుస్తున్నట్టు వార్తలొచ్చాయి. మరికొన్ని రోజులు మహేష్‌ వెకేషన్‌కి విదేశాలకు వెళ్లాడని, సీన్ల విషయంలో ఆయన సంతృప్తిగా లేదని అన్నారు. త్రివిక్రమ్‌కి, మహేష్‌బాబుకి మధ్య మనస్పర్థాలు వచ్చాయనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ వివాదాంశాల కారణంగానే సినిమా షూటింగ్‌ నిలిచిపోయింది. ఆ తర్వాత ఎట్టకేలకు సినిమాని కంప్లీట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. సంక్రాంతి టార్గెట్‌ చేశారు. ఆ ప్రకారంగానే చిత్రీకరణ చేస్తూ వచ్చారు. 

విడుదలైన గ్లింప్స్, టీజర్‌ ఆకట్టుకున్నాయి. అలాగే ఫస్ట్ సాంగ్‌ ఫర్వాలేదనిపించింది. రెండో సాంగ్‌ విషయంలో ఫ్యాన్స్ నుంచి తీవ్ర అసంతృప్తి ఎదురయ్యింది. లిరిక్‌ బాగా లేదని, మ్యూజిక్‌ ఏమాత్రం బాగా లేదని అంటున్నారు. దీనిపై లిరిక్‌ రైటర్‌ రామజోగయ్య శాస్త్రి స్పందించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కుక్కలతో పోల్చారు. దీంతో ఆయన్ని దారుణంగా ట్రోల్‌ చేశారు మహేష్‌ ఫ్యాన్స్. దెబ్బకి రైటర్‌ సోషల్‌ మీడియా నుంచి వెళ్లిపోయాడు. 

మరోవైపు సాంగ్‌ల విషయంలో మహేష్‌ సైతం అసంతృప్తితో ఉన్నాడని, దర్శక, నిర్మాతలకు ఆయన దీనిపై హెచ్చరిక కూడా చేశారని సమాచారం. ఓ వైపు ఈ విషయం రచ్చ అవుతుంది. మరోవైపు ఇందులో ఎన్ని పాటలున్నాయి, ఎన్ని షూట్‌ అయ్యాయి? ఇంకా ఎన్ని చేయాలనేది సస్పెన్స్ నెలకొంది. దీనికి సంబంధించి రకరకాల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. మహేష్‌ ఫ్యాన్స్ దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించిన వార్తలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో తాజాగా నిర్మాత నాగవంశీ స్పందించారు. 

`సూపర్‌ స్టార్‌ అభిమానులు, సినీ ప్రేమికులు గుంటూరు కారం సినిమాలో నాలుగు ఫుల్‌ సాంగ్స్ ఉన్నాయి, ఒక బిట్‌ సాంగ్‌ ఉంద`ని చెప్పారు నాగవంశీ. ఇప్పటికే మూడు పాటలు, ఒక బిట్‌ సాంగ్‌ షూటింగ్‌ పూర్తయ్యిందని, మా షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 21 నుంచి చివరి పాటని చిత్రీకరించబోతున్నట్టు చెప్పారు. ఇటీవల కొందరు తమ క్లిక్‌ల కోసం ఫేక్‌ న్యూస్‌ ని స్ప్రెడ్‌ చేస్తున్నారని, దీనికి మీరు ఎలా రియాక్ట్ అవుతారో వారికి తెలుసు. అందుకే ఇదంతా చేస్తున్నారని, మేం సైలెంట్‌గా ఉండటం వల్ల వారు వ్యాప్తి చేసే వార్త నిజమనేది వాస్తవం కాదు అని వెల్లడించారు నాగవంశీ. 

అయితే నిర్మాతపై కూడా ఫ్యాన్స్‌ విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఓకే బాస్‌, క్వాలిటీ ప్రొడక్ట్ కోసం వెయిట్‌ చేస్తున్నామని అంటున్నారు. మరికొందరు నువ్వు అతి చేస్తున్నావని నిర్మాతపై సెటైర్లు పేలుస్తున్నారు. అంతేకాదు ఆయన ట్వీట్‌ని స్క్రీన్‌ షాట్‌ తీసుకుని పెట్టుకోవాలని అంటున్నారు. ఎందుకంటే సినిమా వచ్చినప్పుడు ఆయన ట్వీట్‌ చూపించడానికి ఉంటుందని వాళ్లు పరోక్షంగా పంచ్‌లు వేస్తుండటం గమనార్హం. ఇక మహేష్‌బాబు సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి మరో కథానాయిక. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నారు. 

Scroll to load tweet…