సినిమా అనేది ఒక వ్యాపారమని.. సక్సెస్ అయినవాడికే ఇక్కడ విలువ వుంటుందని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు వ్యాఖ్యానించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల నేపథ్యంలో దిల్‌రాజు మీడియాతో మాట్లాడారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్న నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రముఖ నిర్మాత దిల్‌రాజు శనివారం తన ప్యానెల్ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం మా దగ్గర ప్రణాళిక వుందన్నారు. తమ ప్యానెల్‌లో అనుభవజ్ఞులైన వారు వున్నారని దిల్‌రాజు వెల్లడించారు. నాలుగు సెక్టార్లలో సమస్యలు వున్నాయని.. సమస్యల పరిష్కారం కోసం చాలా చేయాల్సి వుందని ఆయన పేర్కొన్నారు. ఫిలిం ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలంటే ఎవరు కరెక్ట్ అని ఆలోచించి ఓటు వేయాలని దిల్‌రాజు కోరారు. తమ ప్యానెల్‌లో వున్న నిర్మాతల పేర్లను ప్రత్యర్ధి ప్యానెల్ ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు.
ఫిలిం ఛాంబర్‌లో 1560 మంది సభ్యులు వున్నారని.. కానీ వీరిలో యాక్టీవ్ మెంబర్స్ 700 నుంచి 800 మందేనని దిల్‌రాజు తెలిపారు. పది బ్యానర్లు వున్నా.. ఒక మనిషికి ఒకటే ఓటు వుండాలన్నదే తమ అభిమతమని ఆయన తెలిపారు. ఇక ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏర్పాటుపైనా కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో యాక్టీవ్‌గా వుండేది, నిరంతరం సినిమాలు తీసేది 80 నుంచి 100 మంది మాత్రమేనని దిల్‌రాజు తెలిపారు.
వారితోనే ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏర్పాటు చేశానని ఆయన చెప్పారు. అయినప్పటికీ నిర్మాతల క్షేమం కోసం తాము పాటుపడుతూనే వున్నామని దిల్‌రాజు వెల్లడించారు. ఇండస్ట్రీకి ఓటు రాజకీయం అక్కర్లేదన్నారు. సినిమా అనేది ఒక వ్యాపారమని.. సక్సెస్ అయినవాడికే ఇక్కడ విలువ వుంటుందని , ఫెయిలైతే రేపు తన పరిస్ధితి కూడా అంతేనని దిల్‌రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
