అఖిల్ హీరోగా నటించిన `ఏజెంట్` చిత్రానికి విడుదలైన తొలి ఆట నుంచి నెగటివ్ టాక్ వచ్చింది. సినిమా ఫలితంపై తాజాగా నిర్మాత అనిల్ సుంకర రియాక్ట్ అయ్యారు. ఫెయిల్యూర్‌కి బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పారు.
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `ఏజెంట్`. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు. ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమాకి ఫస్ట్ షో నుంచి డివైడ్ టాక్ వచ్చింది. పెద్ద డిజాస్టర్ మూవీ అని ఆడియెన్స్ తేల్చేశారు. అభిమానులు కూడా నిరాశ పడ్డారు. సుమారు ఎనబైకోట్ల(వాస్తవంగా తక్కువే ఉంటుంది) బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కనీసం పది కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది.
ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అక్కినేని అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అటు దర్శకుడు, నిర్మాతలపై వాళ్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఆడియెన్స్ సైతం దీనిపై కామెంట్లు చేస్తున్నారు. విడుదల నుంచి దీనిపై రకరకాల విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ఫలితంపై నిర్మాత అనిల్ సుంకర రియాక్ట్ అయ్యారు. ఫెయిల్యూర్‌కి బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పారు. ఆయన ట్వీట్ చేశారు.
ఇందులో నిర్మాత అనిల్ సుంకర చెబుతూ, ``ఏజెంట్` ఫెయిల్యూర్‌కి సంబంధించిన నిందలన్నింటిని మేం స్వీకరిస్తున్నాం. ఇదొక పెద్ద టాస్క్ అని మాకు తెలిసినప్పటికీ, మేం దాన్ని జయించాలని అనుకున్నాం. కానీ బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్ ని ప్రారంభించి పొరపాటు చేశాం. అంతేకాదు కోవిడ్‌తో సహా అసంఖ్యాక సమస్యల కారణంగా సక్సెస్‌ఫుల్ సినిమాని చేయడంలో విఫలమయ్యాం. దీనికి మేం ఎలాంటి సాకులు చెప్పాలనుకోవడం లేదు. అయితే ఈ ఖరీదైన తప్పు నుంచి నేర్చుకుని, ఇలాంటి తప్పులను ఎప్పటికీ పునరావృతం కాకుండాచూసుకుంటామని తెలియజేస్తున్నాం. మాపై నమ్మకం ఉంచిన వారందరికీ హృదయపూర్వక క్షమాపణలు. భవిష్యత్ ప్రాజెక్ట్ లను కష్టపడి, అంకితమైన ప్రణాళికతో నష్టాలు లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం` అని నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఫెయిల్యూర్‌ని ఒప్పుకోవడం సక్సెస్‌కి మార్గం అని అంటున్నారు. వారికి సపోర్ట్ గా పోస్ట్ లు చేస్తున్నారు. మరికొందరు.. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా అన్ని కోట్లు ఎలా ఖర్చు చేశారు సర్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంత సింపుల్‌గా చెప్పారేంటి సర్, దీని వల్ల ఎక్కువగా సఫర్ అయ్యేది అఖిల్ అని వారి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి నిర్మాత పోస్ట్ కి కూడా మిశ్రమ స్పందన లభిస్తుంది.
