పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `హరిహర వీరమల్లు` మూవీకి మొదట దర్శకుడు క్రిష్‌. ఆయన తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. మరి క్రిష్‌ తప్పుకోవడానికి కారణమేంటో నిర్మాత ఏఎం రత్నం వెల్లడించారు.

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన లేటెస్ట్ మూవీ `హరిహర వీరమల్లు`. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతుంది. జూన్‌ 12న రిలీజ్‌ కానుంది. 

ఈ మూవీకి క్రిష్‌ జాగర్లమూడితోపాటు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మించారు. సినిమా రిలీజ్‌కి దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసింది టీమ్‌. అందులో భాగంగా ఇప్పటికే మూడు పాటలను విడుదల చేశారు.

పవన్‌ కళ్యాణ్‌, క్రిష్‌ కి మధ్య క్రియేటివ్ డిఫరెంట్స్ 

త్వరలో `హరిహర వీరమల్లు` ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ నెల 8న ఏపీలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు నిర్మాత ఏఎం రత్నం. ఈ సినిమా నుంచి క్రిష్‌ తప్పుకోవడానికి కారణమేంటో వెల్లడించారు. 

ఇప్పటి వరకు బయట నడుస్తున్న టాక్‌ ప్రకారం.. కథ విషయంలో దర్శకుడు క్రిష్‌కి, పవన్‌ కళ్యాణ్‌ కి మధ్య క్రియేటివ్‌ డిఫరెంట్స్ వచ్చిందని, ఇద్దరికి పడటం లేదనే టాక్‌ వినిపించింది. ఆ సమయంలో ఇది పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

`హరిహర వీరమల్లు` నుంచి క్రిష్‌ తప్పుకోవడానికి కారణం

అలాంటి సమయంలోనే క్రిష్‌ సినిమా నుంచి తప్పుకోవడం, నిర్మాత ఏఎం రత్నం కొడుకు, దర్శకుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడంతో ఆ రూమర్లు నిజమే అనే వాదన వినిపించింది. తాజాగా దీనిపై వివరణ ఇచ్చారు నిర్మాత ఏఎం రత్నం. 

క్రిష్‌ తప్పుకోవడానికి అసలు కారణం ఆయన బయటపెట్టారు. `హరిహర వీరమల్లు` చిత్రాన్ని ప్రారంభించి ఐదేళ్లకిపైగానే అవుతుంది. అయితే కరోనాతోపాటు అనేక కారణాలతో సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ డేట్స్ అనేది పెద్ద సమస్య అయ్యింది.

దర్శకుడిగా జ్యోతికృష్ణ పేరు క్రిష్‌ సజెస్ట్ చేశాడు

దీంతో క్రిష్‌కి వేరే కమిట్‌మెంట్స్ ఉన్నాయట. ఆయన చాలా రోజులు ప్రాజెక్ట్ పై ఉన్నారు, కానీ ఇతర కమిట్‌మెంట్స్ ఉన్న నేపథ్యంలో క్రిష్ తప్పుకున్నట్టు తెలిపారు. అయితే అదే సమయంలో పవన్‌ డేట్స్ సమస్య వచ్చింది. ఆయన రాజకీయంగా బిజీగా ఉండటంతో సినిమాలకు టైమ్‌ ఇవ్వలేకపోయారు. ఇది కూడా క్రిష్‌ తప్పుకోవడానికి కారణమని తెలుస్తుంది. 

అయితే దర్శకుడిగా క్రిష్‌ తప్పుకుంటూ తనే జ్యోతి కృష్ణని దర్శకుడిగా సజెస్ట్ చేశారని తెలిపారు ఏఎం రత్నం. అలా క్రిష్‌ స్థానంలో జ్యోతికృష్ణ వచ్చారని వెల్లడించారు. జ్యోతికృష్ణకి కాలేజీ టైమ్‌ నుంచే కథలంటే ఇష్టమని, `స్నేహంకోసం` సినిమా కథని తనే చెప్పాడని తెలిపారు. 

అప్పుడే తన ఆలోచనలు చాలా పెద్దగా ఉండేవని, ఇప్పుడు ఇలాంటి కథ(హరిహర వీరమల్లు) ఆయనకు బాగా సెట్‌ అయ్యిందని, ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రావడం ఆయన అదృష్టం అని తెలిపారు రత్నం.

`హరిహర వీరమల్లు` క్లైమాక్స్ లో కట్టప్ప ఎపిసోడ్‌

`హరిహర వీరమల్లు` మూవీ రెండు పార్ట్ లుగా రాబోతుందని, మొదటి భాగం ఎండింగ్‌ `బాహుబలి`లో కట్టప్ప ఎపిసోడ్‌ని తలపించేలా ఉంటుందని, చాలా క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తుందన్నారు నిర్మాత ఏఎం రత్నం. 

ఇక సినిమాకి టైటిల్‌ గురించి చెబుతూ, `స్వార్డ్ వర్సెస్‌ స్పిరిట్‌` అనే జ్యోతికృష్ణనే పెట్టారని తెలిపారు. జ్యోతికృష్ణ ఈ సినిమాలోకి ఎంటర్‌ అయిన తర్వాత దాని ట్రీట్‌మెంట్‌ మారిందని, సినిమా కంప్లీట్‌ అయ్యాక క్రిష్‌గారికి కూడా చూపిస్తామని చెప్పడం విశేషం. 

పవన్‌ కళ్యాణ్‌ వీరమల్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్‌, నిధి అగర్వాల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూన్‌ 12న పాన్‌ ఇండియా లెవల్‌లో ఈ మూవీని విడుదల చేస్తున్నారు.