గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌ లో ఉమైద్ భవన్ ప్యాలెస్ లో వీరి వివాహం జరగనుంది. డిసంబర్ 1,2 తేదీల్లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో పెళ్లి జరగబోతోంది.

తాజాగా ఈ జంట ప్రముఖ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ బంధానికి సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ముందుగా ప్రియాంక మాట్లాడుతూ.. ''అందరూ నేను నిక్ గతేడాది న్యూయార్క్ లో జరిగిన మెట్ గాలా కార్యక్రమంలో మీట్ అయ్యామని అనుకుంటున్నారు. కానీ అంతకముందే మా ఇద్దరికీ పరిచయం ఉంది.

మెట్ గాలా వేడుక తరువాత నిక్ నాకు ట్విట్టర్ లో 'నిన్ను కలవాలనుకుంటున్నా' అని మెసేజ్ పెట్టాడు. ట్విట్టర్ లో అలా మెసేజ్ లు పెడితే నా సోషల్ మీడియా టీమ్ ని తెలిసిపోతుందని నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఒకరోజు న్యూయార్క్ లో నా అపార్ట్ మెంట్ కి ఆహ్వానించాను. మా అమ్మ కూడా ఉన్నారు కాబట్టి పరిచయం చేయాలనుకున్నాను. కాసేపు మాట్లాడుకున్న తరువాత నిక్ ఇక వెళ్ళొస్తానని చెప్పి వెళ్లిపోయాడు. 

కనీసం ఒక ముద్దు కూడా ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఈ విషయంలో ఇప్పటికీ నాకు కోపంగా ఉంది. దీని గురించి నిక్ ని అడిగితే మీ అమ్మ అక్కడే ఉన్నారు బాగోదని వెళ్లిపోయా అన్నాడు. ఆ సమయంలో నిక్ ఎంతో మర్యాదపూర్వకంగా నడుచుకున్నాడు'' అంటూ చెప్పుకొచ్చింది. ఇక నిక్.. ప్రియాంకకు ఎలా ప్రపోజ్ చేశారో చెబుతూ.. ''ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా తనను గ్రీస్ లోని క్రెటే ద్వీపానికి తీసుకెళ్లాను.

ఆరోజే తనకు ప్రపోజ్ చేశాను. నేను మోకాలిపై కూర్చొని నన్ను పెళ్లి చేసుకొని ఈ ప్రపంచంలోనే సంతోషకరమైన వ్యక్తిగా మారుస్తావా..? అని అడిగాను. దాదాపు 45 సెకన్ల వరకు ప్రియాంక ఆలోచిస్తూనే ఉంది. అప్పుడు నాకేం చేయాలో అర్ధం కాలేదు. నువ్వు ఒప్పుకుంటేనే నేను నీ వేలికి ఈ రింగ్ పెడతా అని చెప్పగా అప్పుడు  ప్రియాంక ఒప్పుకుంది'' అంటూ చెప్పుకొచ్చాడు.