గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. కొంతకాలంగా హాలీవుడ్ కే పరిమితమైన ఈ బ్యూటీ మూడేళ్ల విరామం తరువాత హిందీలో ఓ సినిమాలో నటించింది. అదే 'ది స్కై ఈజ్ పింక్'.

సోనాలీ బోస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్, జైరా వాసిం కీలకపాత్రలు పోషించారు. చిన్నప్పుడే అరుదైన వ్యాధికి గురైనప్పటికీ పదిహేనేళ్లకే రైటర్ గాగుర్తింపు తెచ్చుకున్న అయిషా చౌదరి జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. అక్టోబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం నాడు ఈ సినిమాను టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఈ క్రమంలో యూనిట్ సభ్యులంతా ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రీమియర్ పూర్తయిన తరువాత ప్రియాంకా ఎమోషనల్ అయ్యారు.

దర్శకురాలు సోనాలీ బోస్ ను హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ తో యూనిట్ అందరూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.