హనుమంతుడి డైలాగ్స్ విషయంలో డైలాగ్ రైటర్ ముంతాషిర్ శుక్లా, చిత్ర దర్శకుడు ఓంరౌత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ప్రియాంక పట్టుబట్టారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్న శుక్రవారం రోజు (జూన్ 16న) విడుదలైన సంగతి తెలిసందే. ఈ మూవీపై మార్నింగ్ షో నుంచే విపరీతమైన నెగెటివిటీ వస్తోంది. సినిమా లో రావణుడి గెటప్, హనుమాన్ డైలాగులు వంటివి జనాలకు షాక్ ఇచ్చాయి. రామాయణాన్ని వక్రీకరించారంటూ విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ చిత్రంలో అమర్యాదకరమైన సంభాషణలు ఉపయోగించారని ఎంపీ ఈ సందర్భంగా ఆరోపించారు. అందుకు గానూ దేశ ప్రజలకు చిత్ర టీమ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ముఖ్యంగా హనుమంతుడి డైలాగ్స్ విషయంలో డైలాగ్ రైటర్ ముంతాషిర్ శుక్లా, చిత్ర దర్శకుడు ఓంరౌత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ప్రియాంక పట్టుబట్టారు. వినోదం పేరుతో పూజించే దేవుళ్లకు భాషను ఆపాదించడం ప్రతి భారతీయుడి మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్న ఆమె.. పురుషోత్తముడైన రాముడిపై సినిమా తీసి.. బాక్సాఫీస్ వద్ద విజయం కోసం మర్యాదకు సంబంధించిన అన్ని హద్దులు దాటడం ఆమోదయోగ్యం కాదంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇక ఎవరు ఏమన్నా సినిమా కలెక్షన్స్ మాత్రం భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ఆదిపురుష్ హిందీ వెర్షన్ ...తొలిరోజు 36.5 కోట్లతో బంపర్ ఓపినింగ్స్ తెచ్చుకుంది. కోవిడ్ తర్వాత హిందీ సినిమాల్లో అత్యథిక ఓపినింగ్స్ తెచ్చుకున్న మూడవ చిత్రంగా నిలిచింది.నార్త్ ఇండియాను ఈ సినిమా టార్గెట్ చేయటం, నిర్మాత, దర్శకుడు, హీరోయిన్ తో సహా మాగ్జిమం ఆర్టిస్ట్ లు హిందీ వారు కావటం అక్కడ వారికి నచ్చుతోందని సమాచారం.
