వరుస పరాజయాలతో సినిమాలకు గ్యాపిచ్చారు నారా రోహిత్‌. చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ వెండితెరపై సందడి చేయబోతున్నారు. `ప్రతినిధి2`తోరాబోతున్నారు. తాజాగా దీని ఫస్ట్ లుక్‌ విడుదలైంది.

నారా రోహిత్‌ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. వరుస పరాజయాలతో సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన నారా రోహిత్‌..ఇప్పుడు మరో పవర్‌ఫుల్‌ కంటెంట్‌తో వస్తున్నారు. తన సూపర్‌ హిట్‌ మూవీ `ప్రతినిధి` కి సీక్వెల్‌ చేస్తున్నారు. రెండు మూడు రోజుల క్రితం ఈ సినిమా ప్రీ లుక్‌ని విడుదల చేశారు. ఇప్పుడు ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది యూనిట్‌. బాడీ మొత్తం న్యూస్‌ పేపర్లు, రాష్ట్రంలో హాట్ టాపిక్, బ్యానర్‌ ఐటెమ్‌లతో కూడిన న్యూస్‌ పేపర్లు కనిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్‌ చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. ఆకట్టుకోవడంతోపాటు ఆలోచింప చేస్తుంది.

వార్తా పత్రికల క్లిప్పుల మాదిరిగానే సామాజిక అంశాలు, సామాజిక సమస్యలపై ఈ చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తుంది. అయితే మీడియాపై సెటైరికల్ గానూ ఉండబోతుందని తెలుస్తుంది. నారా రోహిత్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మూర్తి దేవగుప్తపు(టీవీ 5 మూర్తి) దర్శకత్వం వహిస్తున్నారు. వానరా ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై కుమార్‌ రాజా బత్తుల, అంజనేయులు శ్రీ తోట, కొండకల్ల రాజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే టీవీ 5 యాంకర్‌గా పాపులర్‌ అయిన మూర్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతుండటం విశేషం. ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది.

నారా రోహిత్‌ నటించిన `ప్రతినిధి` సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా మెప్పించింది. రోహిత్‌కి కెరీర్‌లో పెద్ద హిట్ మూవీ. దానికి సీక్వెల్‌ గా ఈ సినిమా రూపొందుతున్న నేపథ్యంలో టైటిల్‌ ప్రకటన నుంచే అంచనాలను నెలకొంది. అయితే ఇది కూడా పొలిటికల్‌ సెటైరికల్‌గా తెరకెక్కించబోతున్నారనేది మరింత ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. ఇక తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో `ఒక వ్యక్తి మళ్లీ అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడతాడు` అనే క్యాప్షన్‌ మరింతగా ఆకట్టుకుంటుంది. ఇందులో నారా రోహిత్ స్లిమ్‌ లుక్‌లో కనిపించడం విశేషం. లావుగా ఉండే రోహిత్‌ బాగా సన్నగయ్యాడనేది తెలుస్తుంది.

ఈ సినిమాకి సాగర్‌ మహతి సంగీతం అందిస్తున్నారు. నాని చమిడి శెట్టి సినిమాటోగ్రాఫర్‌గా, రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, కిరణ్‌ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 25న రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇక ఇందులో నటించే హీరోయిన్‌, నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఏపీ రాజకీయాలపై సెటైరికల్‌గా ఉంటుందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీలోని సమస్యలను పరోక్షంగా ఇందులో చర్చించబోతున్నట్టు టాక్‌. టార్గెట్‌ ఏపీ ఎన్నికలని, జగన్‌ ప్రభుత్వం అని తెలుస్తుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడి కుమారుడైన నారా రోహిత్‌.. 2009 లో `బాణం` చిత్రంతో తెలుగు తెరకి హీరోగా పరిచయం అయ్యారు. `సోలో`తో హిట్‌ అందుకున్నారు. `ప్రతినిధి` తో హిట్ కొట్టారు. ఈ సినిమా వచ్చి ఆల్మోస్ట్ 9ఏళ్లు అవుతుంది. ఇంత గ్యాప్‌తో సీక్వెల్‌ చేయడం విశేషం. అయితే ఆ తర్వాత నారా రోహిత్ చేసిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. కమర్షియల్‌గా ఒక్కటి కూడా మెప్పించలేకపోయింది. ఆయన నటించిన నాలుగు సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. ఈ నేపథ్ంలో కొత్త సినిమాని ప్రకటించారు నారా రోహిత్‌. మరి ఈ సినిమాతోనైనా విజయం వరిస్తుందా చూడాలి.