తెలుగులో దర్శకుడు దేవకట్టా తెరకెక్కించిన 'ప్రస్థానం' సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రూపొందబోతుంది. నిజానికి తెలుగులో హిట్ అయిన వెంటనే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు కానీ సంజయ్ దత్ జైలు పాలవ్వడంతో దర్శకుడు దేవకట్టా ఎదురుచూడక తప్పలేదు.

ఎట్టకేలకు ఈ సినిమా హిందీ రీమేక్ సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. రామాయణ, మహాభారతాలు ఊరికే జరగలేదు అంటూ బలమైన డైలాగ్ తో ఈ మోషన్ పోస్టర్ ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. పోస్ట్ చేసిన తక్కువ సమయంలోనే ఈ పోస్టర్ ను నెటిజన్లు షేర్ మీద షేర్ చేస్తూనే ఉన్నారు. 

సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. టాలీవుడ్ లో సాయి కుమార్ పోషించిన పాత్రను సంజయ్ దత్ పోషిస్తున్నాడు. సంజయ్ దత్ భార్యగా మనీషా కొయిరాలా కనిపించనుంది. విలన్ పాత్రలో జాకీ ష్రాఫ్ ను ఎంపిక చేసుకున్నారు. హీరోగా శర్వానంద్ చేసిన పాత్రను అలీ ఫజల్ పోషించనున్నారు. సంజయ్ తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం.