ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కి ఎదురైన ఓ సంఘటనను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఓ మహిళా అభిమాని తనతో ఫోటో దిగిందని ఆమె భర్త మండిపడ్డ విషయాన్ని తెలిపారు. ఈ సంఘటన తనను ఎంతగానో బాధించిందని అన్నారు.

గుల్మార్గ్ లోని ఓ హోటల్ కి ప్రకాష్ రాజ్ నడుచుకొని వెళ్తున్న సమయంలో ఓ మహిళ తన కూతురుతో వచ్చి సెల్ఫీ కావాలని అడిగిందట. దానికి ప్రకాష్ రాజ్ ఒప్పుకొని సెల్ఫీ ఇచ్చారట. దాంతో వాళ్లు చాలా సంతోషించినట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. అయితే అక్కడకి ఒక్కసారిగా సదరు మహిళ భర్త వచ్చి.. ఆమెని పక్కకు లాగి దూషించారట. సెల్ఫీ డిలీట్ చేయమని అరిచారట.

ప్రకాష్ రాజ్ మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన అలా ప్రవర్తించారని, ఆ సమయంలో సదరు మహిళ కన్నీరు పెట్టుకున్నారని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఆమె భర్తని పక్కకి పిలిచి ''సర్‌.. నీ భార్య నిన్ను పెళ్లి చేసుకుని, అందమైన కుమార్తెను నీకిచ్చి, జీవితాన్ని పంచుకోవడానికి.. నేను, మోదీ కారణం కాదు. వారు మీ అభిప్రాయాల్ని గౌరవిస్తున్నప్పుడు.. మీరూ అలానే వారినీ గౌరవించండి'' అని చెబితే కనీసం సమాధానం కూడా చెప్పకుండా ఆ వ్యక్తి నుంచున్నారని బాధతో అక్కడ నుండి వచ్చేసినట్లు ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు.

తన ఫోటోని డిలీట్ చేసినా, చేయకపోయినా పెద్ద విషయం కాదని.. కానీ వారి మనసుకు అయిన గాయాన్ని నయం చేయగలడా అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు.