బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం హిందీ సినీ పరిశ్రమలోని చీకటికోణాలను తెర మీదకు తీసువస్తోంది. బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా పరిచయం అయిన నటీనటులను వారసులుగా పరిచయం అయిన వారు వేధిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. చాలా కాలం క్రితమే నటి కంగనా రనౌత్ ఈ విషయాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. నెపోటిజం పేరుతో భారీ ఆరోపణలు చేసింది. అయితే తాజాగా సుశాంత్ మరణంతో మరోసారి అదే అంశం తెర మీదకు వచ్చింది. సుశాంత్ మరణంతో దిగ్బ్రింతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు నెపోటిజం పై కూడా స్పందిస్తున్నారు.

తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ కూడా ఈ విషయంపై స్పదించాడు. ఇండస్ట్రీలో పాతుకుపోయిన నెపోటిజంపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ప్రకాష్ రాజ్‌. నా జీవితంలోనూ నెపోటిజం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా అని చెప్పాడు ప్రకాష్ రాజ్. అంతేకాదు వారసత్వం కారణంగా తాను ఎంతగానూ వేధన చెందినట్టుగా ఆయన తెలిపాడు. కానీ ఏ రోజు ధైర్యం కోల్పోలేదని చెప్పాడు. కానీ పాపం సుశాంత్ చిన్నవాడు తట్టుకోలేకపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకనైనా ఇలాంటి వారికోసం నిలబడదామా.. వాళ్ల కలలు కల్లలు కాకుండా చూద్దామా అంటూ భావోద్వేగంగా స్పందిచాడు.

తన స్పందనతో  పాటు సుశాంత్ కెరీర్‌ స్టార్టింగ్‌లో నెపోటిజంపై స్పందించిన వీడియోను కూడా షేర్ చేశాడు. 2017లో జరిగిన ఐఫా అవార్డుల కార్యక్రంలో వారసత్వం గురించి సుశాంత్ మాట్లాడాడు. నిజమైన టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయకపోతే ఏదో ఒకరోజుపరిశ్రమ అంతా నాశనం అవుతుందని కామెంట్ చేశాడు సుశాంత్‌. అయితే గత కొంత కాలంగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ప్రస్తుత పరిస్థితులను జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.