పెద్ద హీరోయిన్స్ ఒక స్థాయికి వెళ్లిన త‌ర్వాత ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది లేద‌నే చెబుతారు. ఎక్కడో కొంతమందే బయిటపడతారు. ఎందుకు లేనిపోని తలనొప్పులు అని ఆలోచిస్తారు. అయితే  ఎవ‌రైతే స‌క్సెస్ కాలేదో వారి నుంచి మాత్రం క్యాస్టింగ్ కౌచ్ ఫిర్యాదులు వ‌స్త్తూంటాయి అని ఈ మధ్యన ఓ సీనియర్ నటీమణి వ్యాఖ్యానించింది. ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ రెండు సంద‌ర్భాల్లో ఉంటుంది. ప్ర‌స్తుతం అమ్మాయిల కోస‌మే సినిమాలు తీసే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని, ఎక్క‌డైనా అంద‌మైన అమ్మాయి ఉంటే వాళ్ల‌తోనే సినిమాలు తీయ‌డానికి ద‌ర్మ‌క‌, నిర్మాత‌లు ఇంట్రెస్ట్ చూపెడ‌తారు అని అంది.

ఈ సీనియర్ నటి మాటల్లో నిజమెంత అనేది ప్రక్కన పెడితే ఇప్పటికే సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని, దీని వల్ల తీవ్ర ఇబ్బందులకు లోనయ్యామంటూ గతంలో ఎందరో నటీమణులు మీడియా ముందు వాపోయారు. ఆ మధ్య వచ్చిన మీటూ ఉద్యమం కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ వివాదాన్ని మరోసారి తెరమీదకు తీసుకువచ్చింది. రీసెంట్ గా దివంగత నటుడు సుశాంత్‌ రాజ్‌పుత్‌ మాజీ ప్రేయసి అంకితా లోఖండే సైతం చిత్రపరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాలను షేర్ చేసుకుంది.

ఇప్పుడు మరో  బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రాచీ దేశాయ్‌ కెరీర్‌ తొలినాళల్లో చవిచూసిన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. ఓ సినిమా చేద్దామని వెళ్తే...ఆ డైరక్టర్ తన నుంచి ఏదో ఆశించారని తెలిపింది. అతని ఉద్దేశం అర్థమై వెంటనే నాకు ఆ సినిమానే వద్దంటూ వచ్చేశానని చెప్పింది. అయితే ఆ డైరెక్టర్‌తో సినిమాలో నటించనని తెగేసి చెప్పినప్పటికీ అతడు ఇప్పటికీ తరచూ ఫోన్లు చేస్తున్నాడని వాపోయింది. అప్పుడు మాత్రమే కాదు.. ఇప్పుడు కూడా అతడి సినిమాల్లో నటించనని తేల్చి చెప్పానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అయితే ఆ డైరక్టర్ ఎవరనేది మాత్రం ఆమె రివీల్ చేయలేదు.