టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కృష్ణం రాజు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

నేడు పెను విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. 83 ఏళ్ల కృష్ణంరాజుకి ముగ్గురు కూతుళ్లు. 1940 జనవరి 20న ఆయన జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ఆయన స్వగ్రామం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సినిమాపై మక్కువతో మద్రాసు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నం చేశారు. 1966లో విడుదలైన చిలకా గోరింకా చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత రెండో తరం స్టార్స్ లో ఒకరిగా ఎదిగాడు. కెరీర్ లో 187 చిత్రాల్లో నటించిన కృష్ణం రాజు చివరిగా రాధే శ్యామ్ మూవీలో నటించారు. తన తమ్ముడు కుమారుడు ప్రభాస్ ని నటవారసుడిగా పరిశ్రమకు పరిచయం చేశాడు. కృష్ణంరాజు మరణవార్త విన్న టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. అభిమానులు, చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. 

బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, తల్లీ కొడుకులు, పెళ్లి కూతురు, మహ్మద్ బిన్ తుగ్లక్, హంతకులు దేవాంతకులు, నీతి నియమాలు, తాండ్ర పాపారాయుడు, మనవూరి పాండవులు, కటకటాల రుద్రయ్య, పల్నాటి పౌరుషం, తాతా మనవడు, బావా బావమరిది లాంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. భక్త కన్నప్ప టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. శివ భక్తుడిగా కృష్ణం రాజు నటన అబ్బురపరిచింది. 

1991లో కృష్ణంరాజు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరపున నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరిన కృష్ణంరాజు 1999లో జరిగిన అదే ఎంపీ స్థానం నుండి మధ్యంతర ఎన్నికల్లో గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. దశాబ్దాల ప్రస్థానంలో కృష్ణంరాజు అనేక ముఖ్యమైన పదవులు చేపట్టారు.