రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా ప్రభాస్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మెల్లమెల్లగా నేషనల్ హీరోగా మారిపోయాడు ప్రభాస్. కృష్ణంరాజు స్థాపించిన 'గోపికృష్ణ మూవీస్' బ్యానర్ లో గతంలో 'బిల్లా' సినిమా చేశాడు ప్రభాస్.

ఆ తరువాత ఆ బ్యానర్ లో చేయడానికి ప్రభాస్ టైం దొరకలేదు. ఎప్పటినుండో ప్రభాస్ తో తన బ్యానర్ లో సినిమాచేయాలని కృష్ణంరాజు అనుకుంటున్నాడు. తన స్వీయ దర్శకత్వంలో, సొంత నిర్మాణ సంస్థ 'ఒక్క అడుగు' అనే సినిమా కూడా ప్లాన్ చేశాడు. కానీ కుదరలేదు.

ఆ తరువాత ప్రభాస్ తో 'భక్త కన్నప్ప' రీమేక్ చేయాలనుకున్నాడు. అది కూడా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు తన పెదనాన్న కోరికను మరోవిధంగా తీరుస్తున్నాడు ప్రభాస్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో రెండు సినిమాలు ఒప్పుకున్న ప్రభాస్.. రాధాకృష్ణతో చేయబోయే సినిమాలో తన పెదనాన్నకి వాటా ఇచ్చేలా చేశాడు. చాలా కాలంగా తనతో సినిమా 
చేయాలనుకుంటున్న పెదనాన్న కోసం కాస్త లేటుగా అయినా.. ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఈ సినిమాపై పెట్టుబడి పెట్టేది యువి వాళ్లే అయినప్పటికీ కృష్ణంరాజు సమర్పకుడిగా వ్యవహరించడం ద్వారా వాటా తీసుకుంటాడట. యువి క్రియేషన్స్ వారు ప్రభాస్ కి స్నేహితులు కావడంతో కృష్ణంరాజుకి భాగస్వామ్యం ఇవ్వడంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. ఈ విషయాన్ని ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్లో కృష్ణంరాజు కూడా ధ్రువీకరించారు.