'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. బాహుబలి వంటి సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందించే పనిలో పడ్డారు మేకర్స్.

ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడనే విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మాఫియా డాన్ అని ఒకసారి, పోలీస్ ఆఫీసర్ అని మరోసారి ఇలా ఏదొక వార్త వినిపిస్తూనే ఉంది. కానీ ఈ సినిమాలో ప్రభాస్ ఓ దొంగగా కనిపించబోతున్నాడట. ఇంటర్నేషనల్ దొంగగా ఎవరికీ చిక్కకుండా ఇంటర్ పోల్ ని ముప్పుతిప్పలు పెట్టే క్యారెక్టర్ లో ప్రభాస్ అభిమానులను ఎంటర్టైన్ చేయబోతున్నాడని టాక్.

పలు దేశాల్లో పురాతన వజ్రాలు దొంగిలిస్తూ పోలీసుల కంట పడకుండా తిరుగుతుంటాడట. అతడ్ని పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ కనిపించనుందని సమాచారం ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఎదురు చూడాల్సిందే!