ఇప్పటికే ప్రధాని  నరేంద్ర మోదీపై ఓ బయోపిక్ తెరకెక్కింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘నరేంద్ర మోదీ’ అనే టైటిల్ తో వచ్చిన  చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో  మోదీ చరిత్రను ప్రతీ ఒక్కరికీ తెలిసే విధంగా మరో బయోపిక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘మన్‌ బైరాగీ’ అనే టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను 17వ తేదీన ప్రధాని పుట్టినరోజు సందర్భంగా బాహుబలి ప్రభాస్ విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీ జీవితానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని విషయాలను ఈ సినిమాలో చూపించనున్నారు.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ  నిర్మిస్తున్న ఈ చిత్రం కథ పరంగా చాలా ఉన్నతంగా ఉంటుందట. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కథ తనకు ఎంతో నచ్చడంతో బన్సాలీ నిర్మించేందుకు అంగీకరించారు.

సంజయ్ లీలా భన్సాలీ మాట్లాడుతూ...‘‘ఈ కథ చాలా రీసెర్చ్ చేసి రాసింది. ప్రధాని కుర్రాడుగా ఉన్న సమయంలో ఆయన జీవితంలో జరిగిన ముఖ్య మలుపు ఈ కథ ద్వారా తెలుస్తోంది. ఇది ఎవరికి తెలియని కథ.. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.