మలయాళ మెగా స్టార్ మోహన్ లాల్ సూపర్ హిట్ చిత్రం 'లూసిఫర్'. ఈ సినిమాను మన మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నిర్మించే ఈ సినిమాకు డైరక్టర్ గా ఎవరు సెట్ అవుతారా అని అభిమానులు ఎందురు చూస్తున్నారు. రకరకాల పేర్లు వినిపించాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా సుజీత్ పేరు వచ్చింది. ఎవరూ మొదట నమ్మలేదు కానీ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ సుజీత్ ని డైరక్టర్ గా ఎంపిక చేసామని చిరంజీవి స్వయంగా చెప్పి షాక్ ఇచ్చారు. దాంతో సాహో వంటి డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్ తో సినిమా ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. 

అయితే అందుకు కారణం ప్రభాస్ అని వినపడుతోంది. ప్రభాస్ స్వయంగా సుజీత్ ని రామ్ చరణ్ కు పరిచయం చేసాడని, కథ వినమని సజెస్ట్ చేసాడని చెప్తున్నారు. ఆ తర్వాత లూసీఫర్ రీమేక్ రైట్స్ కొన్నారని తెలియగానే సుజీత్ డైరక్షన్ అయితే స్టైలిష్ గా ఉంటుందని చెప్పారని చెప్తున్నారు. అయితే రామ్ చరణ్ మాట తీసేయలేక చిరు ఓకే చేసాడని అంటున్నారు. 

ఎంతో అనుభవం ఉన్న చిరు..యంగ్ బ్లడ్ ని ఎంకరేజ్ చేయాలని ఉన్నా...ఆల్రెడీ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్ తో అంటే ఎంతవరకూ వర్కవుట్ అవుతుందనేది పరిశీలించి,నిర్ణయం తీసుకోవాల్సిన విషయం అంటున్నారు అభిమానులు. అయితే స్క్రిప్టులో సుజీత్ చేసే మార్పులు చేర్పులు ఎలా ఉంటాయి అనేది చిరు చూసి ముందుకు వెళ్తారట. ఇక మెగాస్టార్ చిరంజీవికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో మంచి అనుబంధం ఉంది. 'రాఘవేంద్ర' సినిమా సమయంలోనే చిరంజీవి ప్రభాస్ ను ప్రశంసించారు. 

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' తెరకెక్కుతోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటివ‌ర‌కు చిత్రీక‌ర‌ణ 40శాతం పూర్త‌యింది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా న‌టిస్తున్నారు. కీల‌క అతిథి పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టించ‌బోతున్నారు. లాక్‌డౌన్ త‌రువాత దీనికి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ వుండే అవ‌కాశం వుంది.