ఇకపై శిక్ష తప్పదు... ప్రభాస్ కల్కి నిర్మాతల స్ట్రాంగ్ వార్నింగ్!
ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి చిత్రీకరణ దశలో ఉండగా తరచుగా వీడియోలు, ఫోటోలు బయటకు వస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు నిర్మాతలు లీగల్ యాక్షన్ కి సిద్ధమయ్యారు.

ప్రభాస్ (Prabhas)నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD . దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న కల్కి నుండి ఫోటోలు, వీడియోలు లీక్ అవుతున్నాయి. ఇటీవల ప్రభాస్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్కి చిత్రానికి పనిచేస్తున్న విఎఫ్ఎక్స్ సంస్థ ఉద్యోగి దీనికి పాల్పడ్డారని తెలుసుకున్నారు. విఎఫ్ఎక్స్ సంస్థ ఉద్యోగిని తొలగించినా కల్కి చిత్ర నిర్మాతలు సంతృప్తి చెందలేదు. ఆ సంస్థపై న్యాయపరమైన చర్యలకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా అధికారికంగా నోట్ విడుదల చేశారు. కల్కి (Kalki 2898 AD)చిత్రానికి సంబంధించిన క్రియేటివ్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వైజయంతీ మూవీస్ సంస్థకు చెందినవి. నిర్మాణ దశలో ఉన్న కల్కి చిత్ర పాటలు, వీడియోలు, ఫోటోలు, సమాచారం బహిర్గతం చేసినా, సోషల్ మీడియాలో ప్రచారం చేసినా 1957 కాపీ రైట్స్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు. సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
కాగా కల్కి చిత్రంలో ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనె నటిస్తున్నారు. కమల్ హాసన్ కీలక రోల్ చేస్తున్నారు. కల్కి రెండు భాగాలుగా తెరకెక్కే అవకాశం కలదు. ఇటీవల శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో పాల్గొన్న కల్కి యూనిట్ టీజర్ విడుదల చేశారు. అమితాబ్, దిశా పటాని కీలక రోల్స్ చేస్తున్నారు. కల్కి టీజర్ ఆకట్టుకోగా మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. కల్కి చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.