ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్‌’ సినిమా సెట్‌లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని గోరెగావ్‌ ఫిల్మ్ స్టూడియో ఈ సినిమా మొదటి రోజు షూట్ జరుపుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈలోగా మరో ప్రమాదం ప్రభాస్ సలార్ చిత్రం షూటింగ్ సంభందించి జరిగింది. 

‘సలార్‌’ చిత్ర యూనిట్‌ వెళ్తున్న వ్యానును లారీ ఢీకొట్టింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీనగర్‌ కాలనీ వద్ద రాజీవ్‌రహదారిపై మంగళవారం రాత్రి జరిగింది. ఘటనలో నలుగురు సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. చిత్ర సిబ్బంది గోదావరిఖనిలోని తాము బస చేసే హోటల్‌కు ప్రయాణిస్తున్న క్రమంలో యూటర్న్‌ తీసుకుంటుండగా లారీ స్వల్పంగా ఢీకొట్టింది. దీంతో వారి వాహనం దెబ్బతినడంతో పాటు వారు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీప ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

 చికిత్స అనంతరం వారు తమ బసచేస్తున్న హోటల్‌కు వెళ్లారు. ‘సలార్‌’ చిత్రంలో ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ రామగుండంలో ప్రారంభమైంది. ప్రభాస్‌ నటిస్తున్న మరో చిత్రం ‘ఆది పురుష్‌’ సెట్‌లో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ముంబయిలోని ఓ ఫిల్మ్‌ స్టూడియోలో వేసిన సెట్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఒక్కరోజే ప్రభాస్‌ నటిస్తున్న రెండు చిత్రాలకు సంబంధించి ప్రమాదాలు జరగడం గమనార్హం.