ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ మీడియాతో ముచ్చటించారు. తనకు మొహమాటం, బద్ధకం చాలా ఎక్కువని వాటితో పాటు జనాల్లోకలవడానికి కూడా చాలా ఇబ్బంది పడతానని చెప్పుకొచ్చాడు. వాటి నుండి బయటపడడానికి చాలా ప్రయత్నించానని.. కానీ తన వల్ల కావడం లేదని చెప్పారు.

అలానే సినిమా రిలీజ్ రోజు ఒత్తిడిని తట్టుకోవడం కూడా తన వల్ల కాదని వెల్లడించాడు. రిలీజ్ రోజు ఎవరినీ కలవనని, పూర్తిగా స్నేహితులతోనే ఉండిపోతానని చెప్పాడు. ఆ ప్లాన్ లో ఎలాంటి మార్పులు ఉండవని.. రిలీజ్ రోజు దాదాపు చచ్చిపోయినంత స్టేజ్ కి వచ్చేస్తానని అన్నారు. అది మార్చుకోవడానికి ప్రయత్నించినట్లు.. 'రెబల్' సినిమా ఎలాగైనా ఆడియన్స్ తో కలిసి చూడాలనుకున్నట్లు చెప్పారు.

మార్నింగ్ షోకి కూడా బయలుదేరానని.. కానీ మధ్యలోనే డ్రాప్ అయిపోయినట్లు చెప్పారు. ఆ సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైందని వెల్లడించారు. తన సినిమా రిలీజ్ రోజు పడుకుంటానని.. హిట్ టాక్ వస్తేనే లేపమని.. లేకపోతే లేపొద్దని స్నేహితులకు చెబుతానని తన వీక్ నెస్ గురించి చెప్పారు. 

'బాహుబలి' పార్ట్ 1 రిలీజ్ రోజు కూడా పడుకుంటే.. తనను ఎవరూ లేపలేదట. నార్త్ నుండి మంచి టాక్ వచ్చింది.. కానీ తెలుగు ఆడియన్స్ కి పెద్దగా నచ్చలేదు.. దీంతో ప్రభాస్ ని ఎవరూ నిద్రలేపలేదట. దీంతో తనే లేచి ఏమైందని అడిగితే.. జనాలకు నచ్చలేదని చెప్పారట. కానీ మరుసటి రోజు సినిమా క్లిక్ అయిందని చెప్పుకొచ్చారు.