టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్  తీసుకుంటున్న నిర్ణయాలు.. ఇప్పుడు ఆశ్చర్యంగా ఉన్నాయి. ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ని వదులుకోవడం, `వీరసింహారెడ్డి` ఈవెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకోవడం ఆశ్చర్యపరుస్తుంది.

తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థగా రాణిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులపై ఇటీవల ఈడీ, ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చే నిధులు, అలాగే రాజకీయ నాయకులు పెట్టుబడులు, బ్లాక్‌ మనీని సినిమాల్లో పెట్టుబడిగా పెట్టి, వచ్చిన లాభాలను రియల్‌ ఏస్టేట్‌ రంగంలోకి తరలిస్తున్నారనే ఆరోపణలో మైత్రీ ఆఫీసులపై ఈడీ దాడులు చేసినట్టు తెలిసింది. అయితే ఈ దాడుల అంతిమ ఫలితాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. 

కానీ ఆ ప్రభావం మాత్రం మైత్రీ నిర్మాణసంస్థపై గట్టిగానే పడినట్టుగా అనిపిస్తుంది. తాజా పరిణామాలు చూస్తే అందుకు బలాన్నిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బాలకృష్ణ హీరోగా నటించిన `వీరసింహారెడ్డి` చిత్రం సంక్రాంతికి విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. ఈ సినిమా ద్వారా నిర్మాణ సంస్థకి యాభై కోట్ల దాకా లాభాలు వచ్చినట్టు సమాచారం. అదే రోజు విడుదలైన చిరంజీవి `వాల్తేర్ వీరయ్య` ఏకంగా రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని వసూలు చేసింది. ఈ సినిమా నుంచి కూడా యాభై కోట్లకుపైగా లాభాలు వచ్చాయి. మొత్తంగా ఈ రెండు సినిమాలతో నిర్మాణ సంస్థకి వంద కోట్లకుపైగా లాభాలు వచ్చినట్టు ట్రేడ్‌ వర్గాల నుంచి అందిన సమాచారం. 

ఇదిలా ఉంటే ఇటీవల `వీరసింహారెడ్డి` చిత్ర వంద రోజుల వేడుక నిర్వహించాలని భావించారు. అధికారికంగా ప్రొడక్షన్‌ హౌజ్‌ కూడా ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో దీన్ని రద్దు చేసుకుందట. ఈడీ దాడుల నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి ఈవెంట్లు చేస్తే లేనిపోని చిక్కులు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతో వెనక్కితగ్గినట్టు తెలుస్తుంది. అంతేకాదు `వీరసింహారెడ్డి` ఈవెంట్‌ చేస్తే, `వాల్తేర్‌ వీరయ్య` సినిమా ఈవెంట్‌ కూడా చేయాల్సి వస్తుంది. లేదంటే ఆ యూనిట్‌ నుంచి అసంతృప్తి ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని నెమ్మదిగా వెనక్కి తగ్గారని ఫిల్మ్ నగర్‌ టాక్. 

అంతేకాదు మైత్రీ ఓ భారీ ప్రాజెక్ట్ ని కూడా వదులుకుంది. ప్రభాస్‌తో చేయాల్సిన భారీ బడ్జెట్‌ చిత్రం నుంచి కూడా తప్పుకుందట. ప్రభాస్‌ హీరోగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ మూవీ చేయబోతున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. దర్శకుడికి మైత్రీ మూవీ మేకర్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అంతేకాదు ప్రభాస్ కి రూ.75కోట్ల పారితోషికం కూడా నిర్ణయించారట. కానీ ఈ చిత్రం నుంచి అటు దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తప్పుకున్నారట. ప్రస్తుతం ఆయన `వార్‌ 2` సినిమాని రూపొందిస్తున్నారు. దీని పోస్ట్ ప్రొడక్షన్‌ పనులకు చాలా టైమ్‌ పడుతుంది. ఆ తర్వాత `పఠాన్‌ వర్సెస్‌ టైగర్‌` చిత్రం చేయాల్సి ఉంది. అది వచ్చే ఏడాది ప్రారంభించాలనుకుంటున్నారు. 

ఈ కారణంగా ప్రభాస్‌తో సినిమా చేసే టైమ్‌ లేదట. అందుకే దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తప్పుకున్నారని, దీంతో మైత్రీ సైతం నెమ్మదిగా సైడ్‌ అయ్యింది. సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని ప్లాన్‌ చేశారట. ఈడీ దాడుల నేపథ్యంలో ఇంతటి భారీ సినిమా చేసే రిస్క్ తో కూడుకున్నదని భావించిన మైత్రీ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిందని సమాచారం. అయితే సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించాల్సిన ప్రభాస్‌ చిత్రాన్ని `వార్‌ 2`సినిమా డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ చేతిలో పెట్టారట. దీన్ని బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి ఈడీ ఎఫెక్ట్ తో మైత్రీ చాలా విషయాల్లో వెనక్కి తగ్గుతుందని, రిస్క్ చేసేందుకు ఇష్టపడటం లేదని టాక్‌.