రాజకీయాల్లోకి ప్రభాస్ పెద్దమ్మ.. ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..?
ప్రభాస్ పెద్దమ్మ.. మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణం రాజు భార్య శ్యామలాదేవి రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్దం అయినట్టు తెలుస్తోంది. మరి ఆమె ఏ పార్టీలో చేయబోతున్నారు. ఇందులో నిజంఎంత..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్దం అయినట్టు తెలుస్తోంది. దివంగత నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు రాజకీయాల్లో రాణించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు పాలిటిక్స్‌లో ఆయన అనేక ఆటుపోట్లను చూశారు. నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. ప్రధానమంత్రి వాజపేయి మంత్రివర్గంలో చోటు కూడా సంపాదించారు. బీజేపీలోచాలా కాలం కొనసాగారు కృష్ణంరాజు. మధ్యలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళినా అక్కడ ఎక్కువకాలం ఉండలేకపోయారు. మళ్లీ బీజేపీ బాట పట్టారు.
ఇక కృష్ణం రాజు మరణించిన ఇంత కాలానికి ఇప్పుడు ఆయన సతీమణి శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. నిన్నటి వరకు ఈ విషయంపై శ్యామలా దేవి స్పందించలేదు. తాజాగా కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్ నిర్వహణను స్వయంగా చూసుకున్నారు శ్యామలాదేవి.
అంతే కాదు చాలా కాలంగా వినిపిస్తున్న తన రాజకీయరంగ ప్రవేశంపై కూడా మాట్లాడారు. కృష్ణంరాజు మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తానని చెప్పారు. పేదలకు విద్య, వైద్యం అందేలా చూడాలని కృష్ణంరాజు ఎంతగానో తపనపడేవారని, అందుకే ఆయన జయంతి సందర్భంగా మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతానికి తన ఆలోచన అంతా నిరుపేదలకు వైద్యం అందించడంపైనే ఉందని చెబుతూ జయంతి వేడుకలు, హెల్త్ క్యాంప్ విజయవంతంగా పూర్తయ్యాక తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తానని ఆమె వివరించారు.
ఈరకంగా ఆమె రాజకీయ ప్రవేశం వార్తలను కొట్టిపారేయలేదు. రాజకీయాల్లోకి వస్తారు కాబట్టే.. తరువాత విషయం ప్రకటిస్తాను అన్నట్టు హింట్ఇచ్చిరు. ఇక శ్యామలా దేవి వైసీపీతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఆ పార్టీలోకి వెళ్ళడం దాదాపు ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇక అఫీషియల్ గా ప్రకటించడంతో పాటు.. లాంచనంగా వైసీపీలోకి వెళ్లడమే మిగిలినట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.