ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న బాహుబలి 2 ది కన్ క్లూజన్ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ బాహుబలికి సంబంధించిన అనేక విషయాలు పంచుకున్న ప్రభాస్
రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది.. టెన్షన్ గా ఉందా...
బాహుబలి నుంచి ఇంకా బైటికి రాలేదు. సినిమా రిలీజయ్యాక చూడాలి. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవకముందు చాలా టెన్షన్ ఉండేది. రిలీజ్ తర్వాత వినాయక్ గారు రాజమౌళి గారు, నేను అంతా కూర్చుని మాట్లాడుకుంటూ అసలు పది ప్రశ్నలు అలాగే వదిలేసి సినిమాను ఎలా బ్లాక్ బస్టర్ గా మలిచారు అని వినాయక్ గారు అన్నప్పుడు ఇన్ని ప్రశ్నలున్నాయా అనిపించింది. మామూలుగా అయితే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నదే డౌట్. కానీ నిజానికి అవంతిక అడవిలోనే ఎందుకుంది, శివగామి చనిపోవడమేంటి, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ఇలా అనేక ప్రశ్నలు పెండింగ్ లో ఉన్నాయి. మొదట సినిమా అంతా ఒకేసారి ఫినిష్ చేద్దామనుకున్నా... చేస్తుంటే ఇది రెండు పార్ట్ లు చేయాల్సిందేనని నిర్ణయించారు. ఎందుకంటే ఇదో అద్భుతమైన కథ. ఇది హీరోహీరోయిన్ల కథ కాదు. ఎన్నో కేరక్టర్స్ కలిపితే బాహుబలి చిత్రం. రెండు పార్ట్ లుగా కట్ చేయాలనుకున్నా ఎక్కడ పార్ట్ 1, పార్ట్ 2 గా కట్ చేయాలి అన్న దానికే రాజమైళి 15 రోజులు తీసుకున్నారు. మొత్తానికి ఏదో మేజిక్ జరిగి అలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

రెండు కేరక్టర్స్ లో ఏది బాగా నచ్చింది...
అమరేంద్ర బాహుబలి... కింగ్... అన్ని రకాల బాధ్యతలుంటాయి. ధర్మం కోసం నిలబడాల్సిన బాధ్యత, కొడుకుని వదిలి బాహుబలిని రాజును చేసిన శివగామి రాజమాత మాట నిలబెట్టడం, రాజ్యం కోసం నిలబడటం ఇలా అతను ఆలోచించే విధానం వేరు.
కానీ శివుడు వేరు. అతను ఏం తెలీకుండా అడివిలో పెరిగాడు. శివుడిలా బతకడం, ఆ కేరక్టర్ చేయడం పెద్ద కష్టం కాదు. అతనికి ఎలాంటి బాధ్యత లేదు. అడవిలో పెరిగాడు. ఏది కావాలంటే అది చేస్తాడు. ఎప్పుడు ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటాడు. అయితే అతనికి జన్యుపరంగా బాహుబలి జీన్స్ ఉంటాయి. అందుకే ఆవేశంలో భల్లాలుని కొడుకును కూడా చంపగలిగాడు. నాకు అమరేంద్ర బాహుబలి ఎక్కువ నచ్చింది.
ప్రపంచమంతా క్రేజ్ సాధించి సరిహాద్దులు చెరిపేయటంపై...
నాకు రాజమౌళి 5ఏళ్ల క్రితం బాహుబలి లైన్ చెప్పారు. అప్పుడే ఇదేదో మన జీవితంలో నిలిచిపోతుందనిపించింది. అయితే అప్పటికింకా కథ పూర్తి కాలేదు. కానీ 5ఏళ్లలో రాజమౌళి నాకు ఏడెనిమిది కథలు చెప్పారు. దాంట్లో శ్రీ కృష్ణ దేవరాయల కథ కూడా చెప్పారు. మిగతావి కూడా అన్నీ పెద్ద కథలే. వాటిలో పీరియాడిక్ సినిమా కూడా ఉంది. అది చేద్దామనుకుని దాదాపు 60-70 శాతం పూర్తి చేసినా చివరకు వదులుకున్నారు. తర్వాత నేను రెబెల్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాకు బాహుబలి లైన్ చెప్పారు. అది విన్నాక తిరిగి మామూలుగా అవటానికి అప్పుడే 4రోజులు పట్టింది. ఆ లైన్ లో ఉన్న సత్తా ఏంటో మీరు బాహుబలి2లో చూస్తారు. ప్రతి ఒక షాట్ చాలా పర్ ఫెక్ట్ గా చేశారు. అందుకే ఎల్లలు దాటింది. ఫస్ట్ పార్ట్ హాఫ్ బ్లైండ్ గానే రిలీజ్ చేశాం. నిర్మాతలు చాలా ఖర్చు పెట్టారు. టీమ్ లోని ప్రతి ఒక్కరు రిస్క్ తీసుకున్నారు. అయితే రాజమౌళికున్న పాషన్ సినిమాను విజయ తీరాలకు చేర్చింది. అసలు ఇలాంటి సినిమా ఎవరూ తీయలేదని చెప్పాలి. హాలీవుడ్ లో కూడా మబ్బుల్లోంచి జలపాతాలు జాలు వారడం అంత అద్భుతంగా ఎక్కడా చూడలేదు. ఇక వార్ సీన్స్ హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోకుండా బాగున్నాయి. వాటర్ ఫాల్ సీన్ హాలీవుడ్ సినిమాలను మించి ఉంది. ఇదేదో లైఫ్ లో మిగిలిపోయే సినిమా అని చేసేటప్పుడే అంతా అనుకున్నాం.

ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారంటే ఏం చెప్తారు...
ఫస్ట్ పార్ట్ లో చాలా రిస్క్ చేశాం. సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు రెండేళ్లు వెయిట్ చేశారు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అప్పుడున్నంత టెన్షన్ ఇప్పుడు లేదు కానీ... గత వారం రోజులుగా అదేదో తెలియని టెన్షన్ పడుతున్నాం. ఈ సినిమా కోసం నేను అన్నీ పక్కనబెట్టి నాలుగేళ్లు టైం ఇచ్చా. రాజమౌళి టన్నుల కొద్దీ భారం భుజాన వేసుకున్నారు. తేడా వస్తే కోలుకోలేనన్ని డబ్బులు పెట్టిన నిర్మాతలు చాలా రిస్క్ చేశారు. ఇలా ప్రతి ఒక్కరం బాహుబలి కోసం ఎంతో రిస్క్ చేశాం. అందుకే బాహుబలి హిట్ అంటే ఫ్లాపే. బ్లాక్ బస్టర్ అయి తీరాలి. రాజమౌళి లైన్ లోనే అన్ని భాషలకు సరిపడే డెప్త్ ఉంది. దీంట్లో డ్రామా విత్ వార్, పీరియాడిక్ విత్ యాక్షన్, ఇలాంటి డ్రామాతో తెరకెక్కించిన ఒక చిత్రాన్ని ఎప్పుడు చూడలేదు. ఈ సినిమా కోసం అంత డెడికేటెడ్ గా పనిచేయడానికి ఛత్రపతి సినిమా సందర్భంగా రాజమౌలి నాకు క్లోజ్ అవటం కలిసొచ్చింది. ఆయన ఫ్యామిలీ అంతా క్లోజ్ కాబట్టి ఇన్నేళ్లయినా బోర్ కొట్టలేదు. పైగా మా సెట్ లో మా ఎంటర్ టైన్ మెంట్ కోసం ఏది కావాలంటే అది ఉంది. అందుకే ఎక్కడా బోర్ అనిపించలేదు. ఎంటర్ టైన్ మెంట్ కోసం ఎక్కడికో వెళ్లే పని లేకుండా సెట్ లోనే అన్నీ ఉన్నాయి. ఇక ఇంటర్వెల్ మాకు తెలిసినా.... రాజమౌళి డెవలప్ చేసిన తర్వాత చూపిన ఇంటర్వెల్ మళ్లీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. అలా ఎప్పటికప్పుడు రాజమౌళి సినిమాను తీర్చిదిద్దారు.
బాహుబలి సెట్ నుంచి దూరమవటం ఎలా అనిపించింది...
నిజానికి బాహుబలి పార్ట్ 1 రిలీజ్ కు ముందే సెట్ తో దూరమవుతున్న ప్పుడు బాధగా అనిపించింది. అప్పటికే 30 శాతం వరకు పార్ట్ 2 కూడా షూటింగ్ జరిగినా,.. రిలీజ్ కాకముందు భయం ఉండేది. అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు రిజల్ట్ పాజిటివ్ గా రాకుంటే పార్ట్ 2 తీయటం ఎందుకు అని ఫీలింగ్ నాకుండేది. మొత్తానికి టీమ్ లో ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. ఆర్ట్ డైరెక్టర్స్ ఇలా అంతా. ఇక సినిమాలో అహర్నిషలు అప్రమత్తుడు అనే డైలాగ్ ఉంటది. అలా అంతా ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండి కష్టపడి పనిచేశారు. ఎంతగా అంటే నేను స్కూల్ లో కంటే బాహుబలి సినిమా సెట్ లోనే ఎక్కువ క్రమశిక్షణ నేర్చుకున్నా. పొరపాటున చిన్న మిస్టేక్ జరిగినా షూటింగ్ మళ్లీ వన్ మోర్ అంటే కనీసం నాలుగ్గంటలు పట్టేది... మిస్ అయ్యిందా. అన్నీ సెట్ చేసుకునే వరకు నాలుగు గంటలు నష్టం అంటే అది నిర్మాతలకు చాలా లక్షల్లో. అందుకే చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతో పనిచేశా. ఎంతగా అంటే ఓ అరగంట రెస్ట్ కోసం రాజమోళిని టైం అడగాలంటే మనకే దరియ్యదు. అంత సీరియస్ గా పనిచేశా. నేను ఫస్ట్ పార్ట్ , సెకండ్ పార్ట్ కలిపి నేను 300 రోజులు పని చేసా. షూటింగ్ పనయ్యేదాకా పడుకుంటే నిద్ర రాదు.

నెక్స్ట్ మూవీస్ గురించి...
బాహుబలి లాంటి సినిమా వెంటనే మళ్లీ అంటే నేనింక చచ్చిపోత. అయినా ఛత్రపతి చేశాక నేను మిస్టర్ పర్ఫెక్ట్ అసలు చేయద్దు.. కానీ హిట్ చేశారు. అలా అయితే పెద్ద హిట్ రాగానే అంతా సినిమాలు ఆపేయాలి. అందుకే ఎప్పటికప్పడు ప్రేక్షకులకు నచ్చేలా నేనేం చేయాలి అనేది చూస్తా. నాకు వేరే వేరే టైప్ లో చేయాలనుంది. ఇలాంటి సినిమా మళ్లీ చేయాలంటే మాత్రం టైమ్ కావాలి. సుజీత్ సినిమా వివరాలు త్వరలోనే ఇస్తా.
ఇన్నేళ్ల ఓపిక ఎలా కుదిరింది...
నాకు అసలు ఓపిక అంటే 17 ఏళ్ల వయసప్పుడు తెలిసి వచ్చింది. మొగల్తూరులో పెదనాన్న ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు.. నాకు మొగల్తూరు బాధ్యతలు నెల రోజుల పాటు అప్పజెప్పారు. అక్కడ స్థానికంగా ఉండే వాళ్లంతా వచ్చి నాతో ఈ జెండా పెట్టలేదు. ఆ జెండా పెట్టలేదు. వాడక్కడ జండా పెట్టాడు.. వీడిక్కడ జెండా పెట్టాడు. అని అలా ఏవేవో కంప్లైంట్లు. మన వల్ల ఓటైతే రాదు. పోకూడదు అనుకున్నా. వాళ్ల మాటలన్నీ వినాలి. సో విన్నా. దానికి ఎంత ఓపిక కావాలో. ఆ తర్వాత మాత్రం నాన్న వాళ్లకు దండంపెట్టా.. ఇంకోసారి నన్ను పిలవద్దన్నా. అప్పుడే నాకు పేషన్స్ వచ్చింది. నాదో డిఫరెంట్ మైండ్ సెట్.. రాజకీయాల్లోకి రాను.
పార్ట్ 1కు, పార్ట్ 2 రిలీజ్ కు ముందు మీరు తేడాలేమన్నా గమనించారా...
ఇప్పుడు టెన్షన్ కాస్త తక్కువ ఉంది. ఫస్ట్ పార్ట్ కు మా పట్ల రెస్పెక్ట్ ఉండేది. కానీ ఒక తేడా చెప్తా. మొన్న సెకండ్ పార్ట్ ప్రమోషన్ కు ముంబై వెళ్లినప్పుడు ముంబై ప్రెస్ రిపోర్టర్స్ అంతా లెగిసి నిల్చున్నారు. అలాంటి అనుభవాలు సంతోషంగా అనిపిస్తాయి. వాళ్లు ఒక గొప్ప ఇండియన్ సినిమా తీశారని చెప్పారు.
రానా గురించి...
రానా ధైర్యానికి మెచ్చుకోవాలి. ప్రతి నాయకుడి పాత్ర ఇచ్చినా దర్శకునిపై పూర్తి నమ్మకంతో నెగెటివ్ రోల్ చేశాడు. రెండోపార్ట్ సినిమాలో ఇంకా చాలా ఆకట్టుకుంటాడు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరం ఎంతో కష్టపడ్డాం.

బాహుబలి2లో ఏం ఉంటుంది..
రెండు వార్స్... ఉంటాయి. మహా భారతం లో ఉన్న డ్రామా ఉంది. సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే దానికి 20-30 కారణాలుంటాయి. అవేంటంటే.. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఏదో ఒక కారణంతో జరిగే సంఘటన కాదది. ప్రేక్షకులంతా సినిమాలో లీనమవుతారనే నమ్మకం ఖచ్చితంగా ఉంది. దేవసేన ఈ సారి అద్భుతంగా కనిపిస్తుంది.
