ప్రభాస్‌ నటిస్తున్న పౌరాణిక చిత్రం `ఆదిపురుష్‌`. రామాయణం నేపథ్యంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్‌ ఇందులో రాముడిగా కనిపించనుండగా, రావణుడిగా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. సీత పాత్రలో కృతిసనన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాని ఫిబ్రవరి 2న ప్రారంభించనున్నారు. టీ సిరీస్‌ పతాకంపై భూషణ్‌ కుమార్‌, కృషన్‌కుమార్‌లతోపాటు ఓం రౌత్‌, ప్రసాద్‌సుతార్‌, రాజేష్‌ నాయర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమా వర్క్ ప్రారంభమైంది. టెక్నికల్‌ వర్క్ ని స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని ప్రభాస్‌ ప్రకటించారు. సినిమాకి సంబంధించిన మోషన్‌ క్యాప్చర్ టెక్నాలజీ వర్క్ మంగళవారం ప్రారంభమైందని ప్రభాస్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. మరోవైపు దర్శకుడు ఓం రౌత్‌ కూడా ఈ విషయాన్ని తెలిపారు. పౌరాణిక సినిమా కావడంతో టెక్నీకల్‌, వీఎఫ్‌ఎక్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ముందుగా ఆ పని పూర్తి చేసే పనిలో బిజీగా ఉందని యూనిట్‌. ఆ తర్వాత ప్రభాస్‌, ఇతర తారాగణంపై షూటింగ్‌ జరుపనున్నారట. ఈ సినిమాని వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 11న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.