ప్రభాస్ నే కాదు నయనతారని ఒప్పించారా? నిజమైతే బిజినెస్ కేకే
‘కన్నప్ప’ కోసం ప్రభాస్... నయనతార కలిసి కెమెరా ముందుకు రానున్నారా? అంటే నిజమే అంటున్నారు.

జవాన్ చిత్రంతో నయనతార తన సత్తా ఏంటో మరోసారి భాక్సాఫీస్ దగ్గర చూపించింది. నార్త్ ప్రేక్షకులకు ఆమె పరిచయం అయ్యింది. ఇక ప్రబాస్ ఆల్రెడీ తన పాన్ ఇండియా సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న స్టార్. వీళ్లిద్దరి కాంబినేషన్ అంటే అంత ఈజీగా సెట్ అయ్యేది కాదు. ఎప్పుడో ప్రభాస్-నయనతార కాంబో.. యోగి చిత్రంలో కనిపించింది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగానే ఉంది. దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ జంట మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కలిసి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఈ ఇద్దరూ తెరపై శివ పార్వతుల పాత్రల్లో కనిపిస్తారు అంటున్నారు. చిత్ర టీమ్ ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తోంది.
మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్తిరస చిత్రం కన్నప్ప(Kannappa). దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది అని చెప్పబడుతున్న ఈ సినిమా ఈ మధ్యే శ్రీకాళహస్తిలో పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఇక ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్(Mukhesh kumar singh) తెరకెక్కిస్తున్నారు.
కన్నప్ప సినిమాలో శివుడి పాత్ర చాలా కీలకం. అందుకే ఈ సినిమాలో ఆ పాత్ర కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను తీసుకున్నారని వినికిడి. ఇదే విషయాన్ని మంచు విష్ణు ఇండైరెక్ట్ గా రివీల్ చేశారు. ఇటీవల మరో కీలక పాత్ర కోసం చిత్ర టీమ్ నయనతారని సంప్రదించింది. శివ పార్వతుల పాత్రలకోసమే ఆ ఇద్దరినీ సంప్రదించారని సమాచారం. శివ భక్తుడైన కన్నప్ప కథతో ఈ చిత్రం రూపొందుతోంది. భక్తి ప్రధానమైన ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో... అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్త గనుక నిజమైతే.. కన్నప్ప సినిమా రిలీజ్ కు ముందే భారీ క్రేజ్ తెచ్చుకుని బిజినెస్ అవ్వటం ఖాయం అని ట్రేడ్ లో వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.