యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' సినిమా మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందంలో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడుగా జరుగుతున్నాయి. సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది.

పైగా సినిమాను మూడు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ హాఫ్ ని గంటన్నర నిడివికి లాక్ చేశారు. సెకండ్ హాఫ్ విషయంలో ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. సెకండ్ హాఫ్ నిడివి ఎక్కువైందనేది చిత్రబృందం భయం. దాన్ని తగ్గించి ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. 

మరోపక్క హిందీ డబ్బింగ్ పనులు మొదలుకావాల్సివుంది. మూడు భాషల్లో డబ్బింగ్ పూర్తి చేసిన తరువాత సెన్సార్ కి పంపాలి. సాధారణంగా విడుదలకు నాలుగైదు రోజుల ముందుకు సెన్సార్ పూర్తి చేస్తుంటారు. కానీ 'సాహో' సెన్సార్ ని మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేసి.. ఫైనల్ కాపీ రెడీ చేసుకోవాలని భావిస్తున్నారు.

కుదిరితే సెన్సార్ కు రఫ్ కాపీ పంపించి ఆ తరువాత వీఎఫ్ఎక్స్ యాడ్ చేయాలని చూస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ముంబై కేంద్రంగా సాగుతున్నాయి. ప్రస్తుతం  యూనిట్ ఫోకస్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ఉండడంతో తెలుగులో ప్రమోషన్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు.