జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెనుక బీజేపీ ఉందనే ఆరోపణల్లో వాస్తవం లేదని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. దానికి సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కలిసి ఉంటే ఆయనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని... అయినప్పటికీ వేదికపై నుంచి టీడీపీపై విమర్శలు గుప్పించారంటే... ఆ విమర్శల్లో నిజం ఉంటుందని అన్నారు. పవన్ ను తాను నమ్ముతున్నానని చెప్పారు. 

పవన్ కల్యాణ్ నిరాహారదీక్ష చేస్తే, తాను మద్దతు ఇస్తానని తెలిపారు. అయితే, ఆయన నిరాహారదీక్షకు కూర్చోవాలని తాను కోరుకోవడం లేదని... అందరూ బాగున్నప్పుడు పవన్ మాత్రమే ఎందుకు నిరాహార దీక్ష చేయాలని ప్రశ్నించారు. 'పవన్ కల్యాణ్... నీకు బాగా ఎక్కించి, ఆమరణ దీక్షకు కూర్చోబెట్టాలనుకుంటున్నారు. నిన్ను చంపినా చంపేస్తారు. ఐలవ్యూ నాన్నా. నీవు దీక్షకు కూర్చోవద్దు' అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. నిరాహారదీక్షకు అందరూ కూర్చుంటేనే... పవన్ కూడా కూర్చోవాలని అన్నారు.