ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృధ్వీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్స్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమయం దొరికినప్పుడల్లా వీరిద్దరూ వైకాపా తరఫున బలంగా మాట్లాడుతూనే ఉంటారు.

ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ రాజకీయ చిత్రం రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. సెటైర్లు వేయడంలో పోసాని సిద్ధహస్తుడు. గతంలో కూడా ఆయన కొన్ని సెటైరికల్ సినిమాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈసారి వర్తమాన రాజకీయాల ఆధారంగా పొలిటికల్ సెటైర్ కథను రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాలో పోసానితో పాటు పృధ్వీ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ వారంలోనే సినిమా షూటింగ్ మొదలుకానుంది. పోసాని నటిస్తూ దర్శకత్వం వహించే ఈ సినిమాలో చంద్రబాబుని టార్గెట్ చేస్తారని టాక్. సినిమా వివరాలు బయటకి తెలియనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మొదట జగన్ మీద ఈ సినిమా ఉంటుందనే వార్తలు వినిపించాయి. కానీ ఇది జగన్ సినిమా మాత్రం కాదట. పూర్తిగా చంద్రబాబు పాలనపై సెటైరికల్ గా నడిచే సినిమా అని తెలుస్తోంది. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు, అందులో వేటిని సంక్రమంగా ఆచరిస్తున్నారనే విషయాలను ఇందులో చూపించబోతున్నారు.