Asianet News TeluguAsianet News Telugu

సినీ ఇండస్ట్రీకి చెడు మాత్రం చేయను.. చనిపోయేవరకు జగన్ జెండానే: పోసాని కృష్ణమురళి

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పోసాని కృష్ణమురళి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. సీఎం జగన్ తనకు పదవి ఇస్తారనే తాను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. 

posani krishna murali takes charge as ap film development corporation chairman
Author
First Published Feb 3, 2023, 4:59 PM IST

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పోసాని కృష్ణమురళి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలోనే పేర్ని నాని, మల్లాది విష్ణు, లక్ష్మీ పార్వతి, చల్లా మధుసూదన్ రెడ్డి, పున్నూరు గౌతమ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. నాగార్జున యూనివర్సిటీకి వెళ్లే వరకు తనకు రాజకీయాలు తెలియవని అన్నారు. గౌతమ్ రెడ్డి ద్వారానే విద్యార్థి దశ నుంచి రాజకీయాలు తెలుసునని చెప్పారు. సీఎం జగన్ తనకు పదవి ఇస్తారనే తాను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. తనకు జగన్ 11 ఏళ్లుగా తెలుసునని.. కానీ మొన్నటివరకు కూడా ఆయనను కలవలేదని అన్నారు. అయితే ఎప్పుడూ మాట్లాడేవాడినని.. పిలిచినా కలిసేందుకు వెళ్లకుండా ఉండిపోయేవాడినని చెప్పారు. దూరం నుంచి ఇష్టపడేవాడినని తెలిపారు. 

చాలా మంది నాయకులు కులాల నుంచి, మతాల నుంచి, డబ్బులో నుంచి పుడతారని.. కానీ జగన్ మాత్రం జనాల్లో నుంచి పుట్టిన నాయకుడని అన్నారు. అందుకే జగన్ అంటే తనకు ఇష్టమని.. తాను స్నేహం చేశానని చెప్పారు. సినీ ఇండస్ట్రీకి ఎంత మంచి చేస్తానో తెలియదు గానీ.. చెడు మాత్రం చేయనని అన్నారు. మోసాలు చేయనని.. అబద్దాలు  చెప్పనని తెలిపారు. గ్యారెంటీగా సినీ ఇండస్ట్రీకి సేవ చేస్తానని చెప్పారు. తాను చనిపోయేవరకు జగన్ జెండా, వైసీపీ తప్ప.. మరొకటి లేదని అన్నారు. 

ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు పోసాని కృష్ణమురళి ఆత్మీయులని చెప్పారు. జగన్ అభిమానులంతా పోసాని కృష్ణమురళి అభిమానులేనని అన్నారు. జగన్ కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి పోసాని అని చెప్పారు. విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ది కావాలని సీఎం జగన్ ఆకాంక్షించారని తెలిపారు. వంద ఎకరాల్లో స్టూడియోలు నిర్మించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలనే సంకల్పం ఉందని.. ఇప్పుడు పోసానికి ఆ బాధ్యత వచ్చిందని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios