యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హీరోగా దూసుకుపోతున్నాడు. మంచి విజయాలు సాధిస్తూ టాలీవుడ్ లో టాప్ లీగ్ లో కొనసాగుతున్నాడు. ఎన్టీఆర్ తన సినిమాలు తాను చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ కి భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందో లేదో తెలియదు కానీ మీడియాలో మాత్రం గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 

టిడిపి పగ్గాలు చేపట్టాలని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లోకి రాకపోతే బెటర్ అని కొందరు.. ఆ నిర్ణయం ఎన్టీఆర్ కే వదిలేయాలని, ఒత్తిడి చేయకూడదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. సినీ రాజకీయ ప్రముఖులకు ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రశ్నలు మీడియాలో ఎదురవుతున్నాయి. ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ఇటీవల సర్జరీ చేయించుకుని ఇప్పుడే కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా పోసాని మీడియాతో సరదాగా ముచ్చటించారు. 

టిడిపి పగ్గాలు జూ. ఎన్టీఆర్ చేపట్టాలనే ప్రశ్నకు పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూ. ఎన్టీఆర్ వచ్చినా ఇక్కడ బండి నడవదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి పాలన అంతా అవినీతి మయం అయిపోయినప్పుడు, పరిపాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు మరొకరికి అవకాశం కల్పిస్తారు. 

కానీ జగన్ అలాంటి అవకాశం మరెవ్వరికీ ఇవ్వరు అని పోసాని తెలిపారు. ఒక హీరో వచ్చి ఆకాశం నుంచి చుక్కలు తీసుకొస్తానంటే ప్రజలు నమ్మరు అని పోసాని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా టిడిపి ఘోర పరాజయంతో జూ.ఎన్టీఆర్ పేరు మాత్రం బలంగా వినిపిస్తోంది.