వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం టాలీవుడ్ ప్రముఖులకు ఇష్టం లేదు అంటూ కమెడియన్ పృథ్వి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గత ఎన్నికల్లో పృథ్వి వైసిపి తరుపున జోరుగా ప్రచారం నిర్వహించాడు. జగన్ ప్రస్తుతం పృథ్వికి ఎస్వీబిసి ఛానల్ చైర్మన్ పదవిని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. 

సినీ ప్రముఖులెవరూ కనీసం శుభాకాంక్షలు చెప్పేందుకు కూడా జగన్ ని కలవలేదని పృథ్వి పలు సందర్భాల్లో ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశంలో స్పందించారు. పృథ్వి తప్పుగా మాట్లాడాడని, బహుశా తొందరపడి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటాడని పోసాని అన్నారు. 

వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నిర్మాత సురేష్ బాబు సీఎం ఆఫీసుకు ఫోన్ చేశారు. సినీప్రముఖులం అంతా ఓ సారి జగన్ ని కలవాలనుకుంటున్నట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడం వల్ల తర్వాత సమాచారం అందిస్తామని సీఎం ఆఫీస్ వారు సురేష్ బాబుకు తెలిపారు. 

ఈ విషయం పృథ్వికి తెలియదేమో. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కొంతమంది సినీప్రముఖులు కోరుకోవచ్చు అందులో తప్పు లేదు. కానీ జగన్ గెలిస్తే వాళ్లకు ఇబ్బందేమీ ఉండదు కదా. అలాంటప్పుడు జగన్ పై చెడు అభిప్రాయం ఎందుకు ఉంటుంది అని పోసాని తెలిపారు. 

ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంతో సినిమాల్లో నటిస్తున్నాని పోసాని తెలిపారు. చేతిలో 7 సినిమాల వరకు ఉన్నాయి. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో, కొరటాల శివ దర్శకత్వం వహించే చిత్రంలో, విజయ్ కుమార్ కొండా చిత్రంలో ఇలా పలు చిత్రాల్లో నటిస్తున్నట్లు పోసాని తెలిపారు.