ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఇటీవల ముగిసిన ఏపీ ఎన్నికల నేపథ్యంలో మీడియాలో బాగా కనిపించారు. వైఎస్ జగన్ కు ఎన్నికల్లో మద్దతు తెలిపారు. మీడియా సమావేశాలు నిర్వహించి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని తీవ్రంగా విమర్శించారు. జగన్ కు మద్దతు తెలపడం వల్ల సినిమా అవకాశాలు తగ్గాయని కమెడియన్ పృథ్వి గురించి వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పృథ్వి వివరణ ఇచ్చాడు. 

తాజాగా పోసాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జగన్ కు మద్దతు ఇవ్వడం వల్ల సినిమా ఆఫర్స్ బాగా తగ్గాయని అన్నారు. ప్రస్తుతం పోసాని అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. చంద్రబాబుని, టీడీపీని తిట్టానని కొన్ని సినిమాల నుంచి తనని తీసేశారని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ముందుగా ఓ చిత్రంలో నన్ను ఎంపిక చేసిన తర్వాత కూడా లిస్టులో నుంచి తన పేరు తీసేశారని పోసాని ఆరోపించారు. ఆ నిర్మాత ఎవరో కాదు అశ్విని దత్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉన్న నాయకుల్లో నాకు జగన్ నచ్చారు. కానీ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా టీడీపీ మద్దతు దారులే ఉన్నారు. దీనివల్ల సహజంగానే తనకు అవకాశాలు తగ్గుతాయని పోసాని అన్నారు. 

ఇక చిత్ర పరిశ్రమని ఏపీకి తరలించాలనే ఆలోచన సరైనది కాదని, తెలంగాణాలో టాలీవుడ్ చిత్రాలకు 45 శాతం షేర్ వస్తుందనే వాస్తవాన్ని గ్రహించాలని పోసాని తెలిపారు.