ఎన్నికల కమిషన్ నుండి తనకు లెటర్ రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి. పోసాని రూపొందిస్తోన్న 'ముఖ్యమంత్రి గారు.. మీరు మాట ఇచ్చారు' అనే సినిమా విడుదల ఆపేయాలని ఎన్నికల సంఘం నుండి తనకు లేఖ వచ్చిన కారణంగా ప్రెస్ మీట్ నిర్వహించి మీడియాతో మాట్లాడారు.

అసలు సినిమాలో తానేం చూపించానో.. ఏం చెప్పానో.. తెలియకుండా సినిమా ఆపేయాలని ఎవడెవడో లెటర్ లు రాస్తుంటారని.. ఎలక్షన్ కమిషన్ వాళ్లు అన్నింటికీ స్పందిస్తారా..? అంటూ ప్రశ్నించాడు. సెన్సార్ నిబంధనలకు లోబడే తాను సినిమా తీసినట్లు స్పష్టం చేశాడు.

తాను ఎవరికీ వ్యతిరేకి కాదని, ఏ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సినిమా తీయలేదని అన్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటే సినిమాలు ఓటర్లను ప్రభావితం చేస్తుందని, నైతికత లేదని అంటున్నారు. నేనేమైనా వ్యభిచార గృహం పెట్టానా..? అంటూ ఫైర్ అయ్యారు.

నిజంగా సినిమా ప్రభావితం చేస్తుందనుకుంటే.. టీవీల ముందు కూర్చొని పార్టీల గురించి మాట్లాడుతున్నారు.. అది ప్రభావితం చేయదా..? అంటూ ఎదురు ప్రశ్నించారు.