ప్రముఖ తమిళ హాస్య నటుడు తవసి కన్నుమూశారు. నాల్గో స్టేజ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్‌ దుఖసాగరంలో మునిగిపోయింది. ఓ అద్భుతమైన కమేడియన్‌ని కోల్పోయామని తమిళ చిత్ర ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తవసి కోలీవుడ్‌లో పాపులర్‌ కమెడీయన్‌గా పేరు తెచ్చుకున్నారు. అనేక ఏళ్లపాటు తనదైన హాస్యంతో నవ్వులు పూయించారు. 

అయితే ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తెలిసి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ఆర్థిక సాయాన్ని అందించారు. తన కుమారుడు అరుముగన్‌ విజ్ఞప్తి మేరకు విజయ్‌ సేతుపతి లక్ష రూపాయలు సహాయం అందించారు. శివకార్తికేయన్‌ రూ.25వేలు, మరో కమెడీయన్‌ సూరి రూ.20వేలు అందించారు. అలాగే డీఎంకే ఎమ్మెల్యే డాక్టర్‌ శరవణన్‌ ముందుగా ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. 

ఇటీవల పూర్తిగా క్షీణించిపోయిన ఫోటోలు అందరిని కలచి వేశాయి. తవసి చివరి స్టేజ్‌ క్యాన్సర్‌ తో పోరాడుతున్న నేపథ్యంలో ఆయన్ని రక్షించడం డాక్టర్‌ కు కూడా సాధ్యం కాలేదు. ఆహారం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పరిస్థితి విషమించడంతో నిన్న మరణించారు. దీంతో అయన మృతి పట్ల పలువురు సినీ పెద్దలు సంతాపం ప్రకటించారు. తవసి నటుడిగా `సువరాపాండియన్`, `వరుతాపాధ వాలిబార్ సంగం`, `రజిని మురుగన్` సినిమాలు మంచి గుర్తింపునిచ్చాయి. ప్రస్తుతం ఆయన రజనీకాంత్‌ నటిస్తున్న `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నట్టు సమాచారం.