టాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తారకరత్న మరణాన్ని మర్చిపోకముందే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్‌ జీజీ కృష్ణారావు కన్నుమూశారు. 

ప్రముఖ సీనియర్‌ ఎడిటర్‌ జీజీ కృష్ణారావు కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. `శంకరాభరణం`, `సాగర సంగమం` వంటి దాదాపు రెండు వందలకుపైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన కృష్ణారావు మరణించడంతో టాలీవుడ్‌లో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా టాలీవుడ్‌లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, జమున, వాణీ జయరాం, చలపతిరావు, ఇటీవల తారకరత్న, ఇప్పుడు ఎడిటర్‌ జీజీ కృష్ణారావు వరుసగా సీనియర్‌ సినీ ప్రముఖులు మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. 

గుడివాడ ఏఎన్‌ఆర్‌ కాలేజీలో ఎమ్మెసీ చేసిన జీజీ కృష్ణారావు ఆ తర్వాత మిలటరీలో చేరారు. కానీ సినిమాలపై ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని వదిలేసి పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. 1961-62లో ఎడిటింగ్‌లో కోర్స్ చేశారు.ఆ సమయంలోనే దర్శకుడు ఎడిటర్‌ ఆదుర్తి సుబ్బారావు కంట పడ్డారు. ఆయనతో పరిచయం సినిమాల వైపు నడిపించింది. ఆదుర్తి సుబ్బారావు ప్రోత్సాహంతో చెన్నయ్‌ వెళ్లిన కృష్ణారావు అక్కడే ప్రాక్టికల్‌ చేయించారు. అంతేకాదు ఆదుర్తి రూపొందించిన `జ్వార్‌ భాటా` చిత్రంతో కృష్ణారావుని ఎడిటర్‌గా పరిచయం చేశారు. `పాడవోయి భారతీయుడా` చిత్రంతో తెలుగులో ఎడిటర్‌గా పరిచయం అయ్యారు. 

కళాతపస్వి కె విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన `శంకరాభరణం`, `సాగరసంగమం`, `సప్తపది`, `శుభసంకల్పం` చిత్రాలకు ఆయనే ఎడిటర్‌. అందులో `సప్తపది`, `సాగరసంగమం`, `శుభసంకల్పం` చిత్రాలకు ఎడిటర్‌గా నంది అవార్డులను అందుకున్నారు. `సప్తపది`(1981) చిత్రం నుంచి ఎడిటర్‌ విభాగంలో నంది అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. తొలి అవార్డు జీజీ కృష్ణారావుకి దక్కడం విశేషం. విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన `సీతామాలక్ష్మి`, `శుభలేఖ`, `స్వాతముత్యం`, `సూత్రధారులు`, `సిరివెన్నెల`, `స్వరాభిషేకం` చిత్రాలకు కూడా ఎడిటర్‌గా పనిచేశారు. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంది. విశ్వనాథ్‌ సినిమాలకు కృష్ణారావు ఎడిటర్‌గా ఉండాల్సిందే అనేట్టుగా మారిపోయింది.

వీటితోపాటు ఎన్టీఆర్‌ హీరోగా దాసరి రూపొందించిన `సర్ధార్‌ పాపారాయుడు`, `బొబ్బిలిపులి`, బాపు దర్శకత్వంలో వచ్చిన `శ్రీరామరాజ్యం`, జంద్యాల తొలి చిత్రం `ముద్దమందారం`, అలాగే `నాలుగు స్థంభాలాట` వంటి రెండు వందలకుపైగా చిత్రాలకు జీజీ కృష్ణారావు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతో సేవ చేశారు. ఆయన మరణంతో టాలీవుడ్‌ మరోసారి షాక్‌కి గురయ్యింది. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.