ప్రముఖ సినీ నటుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ ని కలవడానికి వచ్చిన ఓ కుటుంబం ప్రస్తుతం భిక్షమెత్తుకొని జీవిస్తున్నారు. కొడుకుకి వైద్యసాయం కోరడానికి వచ్చిన ఆ అభాగ్యులు చెన్నై ఎగ్మూర్ రైల్వేస్టేషన్ లో భిక్షమెత్తుకొని బతుకుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. రాజపాళైయంకి చెందిన యువతి గృహలక్ష్మికి గురు సూర్య అనే కొడుకున్నాడు.అయితే రెండేళ్ల వయసు వరకూ గురు సూర్య నడవలేకపోయాడు. మాటలు కుడా రాలేదు. కొంతకాలానికి పిల్లాడికి గుండెజబ్బు ఉందనే విషయం తెలిసింది.

కొడుకుని కాపాడుకోవడం కోసం ఆమె చాలానే ప్రయత్నాలు చేసింది. కానీ ప్రయోజనం లేకపోయింది. భర్త కూడా ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో గృహలక్ష్మికి సోదరుడు వెంకటేశన్ అండగా నిలిచాడు. అలాంటి పరిస్థితుల్లో ఎవరో చెన్నైకి వెళ్లి నటుడు లారెన్స్ ను కలవమని సలహా ఇచ్చారు.

దీంతో గృహలక్ష్మి వారం రోజుల క్రితం కొడుకు, సోదరుడితో కలిసి లారెన్స్ ని కలవడానికి చెన్నైకి వచ్చింది. అయితే వారికి లారెన్స్ అడ్రెస్ దొరకకపోవడంతో తిరిగి ఊరికి వెళ్లలేక, కొడుకుని రక్షించుకోలేక చెన్నై, ఎగ్మూర్ రైల్వే స్టేషన్ లోనే ఉండిపోయారు. అక్కడ ప్రయాణికులు వేస్తోన్న భిక్షంతో పొట్ట పోషించుకుంటున్నారు. ఈ పరిస్థితిలో వారిని ఎవరైనా ఆడుకుంటారేమోనని ఆశిస్తున్నారు!