బిగ్ బాస్ సీజన్ 2 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన పూజా రామచంద్రన్ కొద్దిరోజుల్లోనే అందరినీ మెప్పించింది. టాస్క్ ల విషయంలో శారీరకంగా ఎంతో శ్రమ తీసుకొని చేసేది. దీంతో ఆమెకి అభిమానులు పెరిగారు. 

కానీ తెలుగు మాట్లాడలేకపోవడం, ఇతర విషయాల కారణంగా ఆమె ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ లోకి వచ్చిన తరువాత ఆమె వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టారు నెటిజన్లు. ఈ క్రమంలో ఆమెకి జాన్ కొక్కెన్ అనే నటుడితో ఎఫైర్ ఉందని, ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ విషయంపై స్పందించింది పూజా.

వృత్తిపరంగా, వ్యక్తిగతం చేదు అనుభవాలు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందు వీజేగా పని చేస్తున్న సమయంలోనే తోటి వీజేని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు చెప్పిన పూజా, రెండేళ్ల తరువాత అతడి నుండి విడాకులు తీసుకున్నట్లు తెలిపింది. ఒకరితో ఒకరు గొడవ పడడం ఇష్టంలేక వివాహబంధాన్ని రద్దు చేసుకున్నట్లు చెప్పింది.

అయితే ఈ కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లిన తనకు జాన్ కొక్కెన్ స్నేహం ఎన్నో మార్పులను తీసుకురాగలిగిందని స్పష్టం చేసింది. జాన్ కూడా నటుడిగా స్థిర పడడానికి కష్టపడుతున్నాడని, సినిమాల్లో ఎదురయ్యే సాధకబాధకాల గురించి తనకు బాగా తెలుసని చెప్పింది. జాన్ తనకు స్నేహితుడు, ఆప్తుడు మాత్రమేనని తమ మధ్య అంతకుమించి ఎలాంటి రిలేషన్ లేదని క్లారిటీ ఇచ్చింది.