'ముకుందా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్డే ఆ తరువాత బాలీవుడ్ 'మొహంజదారో'లో ఛాన్స్ రావడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. ఆ సినిమా కోసం దాదాపు రెండేళ్ల పాటు ఏ సినిమా చేయకుండా ఉండిపోయింది. దాంతో పెద్ద దర్శకుల సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని చెబుతోంది పూజా.

ఆమె మాట్లాడుతూ.. ''మొహంజదారో సినిమా చేసినప్పుడు రెండేళ్లు మరే సినిమా చేయనని అంగీకరించాను. దాంతో పెద్ద సినిమాలు వదులుకున్నాను. కానీ ఆ సినిమా హిట్ అవ్వలేదు. ఏ పని చేసినా పూర్తి అంకిత భావంతో చేయాలని ఫలితం గురించి ఆలోచించకూడదని అనుభవం వచ్చింది.

ఆ తరువాత నుండి సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కానీ రిజల్ట్ మన చేతుల్లో ఉండదు కదా.. అందుకే సినిమా అంగీకరించేప్పుడు సెట్స్ లో ఎంజాయ్ చేయగలనా..? లేదా..? అని చూస్తాను. సినిమా హిట్ అయితే ఆ సంతోషం వారం లేదా పది రోజులు ఉంటుంది.

కానీ షూటింగ్ కొన్ని నెలలు ఉంటుంది. హిట్, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా అన్ని రోజులూ పనిని ఎంజాయ్ చేయగలగాలి. ఓ సినిమా ఒప్పుకునే ముందు కథతో పాటు హీరో, నిర్మాణ సంస్థ గురించి కూడా ఆలోచిస్తాను. 

తెలుగులో ఓ స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ కథ నచ్చకపోవడంతో వదిలేశాను. బాలీవుడ్ లో కూడా రెండు సినిమాలు అలానే వదులుకోవాల్సి వచ్చింది'' అంటూ చెప్పుకొచ్చింది.