మనకో సామెత ఉంది ..రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని...అంటే సమర్దుడైన వాడు ఏదైనా చెయ్యాలనుకుంటే అది ఖచ్చితంగా జరుగితీరుతుంది అని అర్దం. అది ఏ రంగానికైనా వర్తిస్తుంది. తాజాగా ఈ సామెని గుర్తు చేసారు పూజ హెడ్గే. ఆమె డబ్బింగ్ చెప్పటం కోసం ఏకంగా హోటల్ రూమ్ నే డబ్బింగ్ స్టూడియోగా మార్చేసారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. 

హిందీతోపాటు తెలుగులోనూ  దూసుకుపోతున్న హీరోయిన్ పూజా హెగ్డే . గత సంవత్సరం  ఒకేసారి ‘అరవింద సమేత’, ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమా షూటింగ్‌లలో పాల్గొంది.  అయితే ‘అరవింద సమేత’ సినిమా కోసం ఓ సాహసం చేయాల్సి వచ్చింది. ఆ సినిమా అనుకున్న సమయానికి విడుదల చేయడం కోసం హోటల్‌ గదినే డబ్బింగ్ స్టూడియో‌గా మార్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా డబ్బింగ్‌ చెబుతున్న ఫొటో షేర్‌ చేశారు.

‘‘అరవింద సమేత’కు డబ్బింగ్‌ చెప్పేందుకు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ హోటల్‌లో నా గదిని డబ్బింగ్‌ స్టూడియోగా మార్చేశాం. సరైన సమయంలో విడుదల చేయడానికి ఇలా చేయాల్సి వచ్చింది. ‘హౌస్‌ఫుల్‌ 4’ షూటింగ్‌లో పాల్గొంటూ.. మరోపక్క డబ్బింగ్‌ చెప్పా. క్రేజీ టైమ్‌.. కానీ సరదాగా గడిచింది. కష్టపడే గుణం ఉండి, చేస్తున్న పనిని ఇష్టపడే స్వభావం ఉంటే ప్రతీదీ సాధ్యమే’ అని ఆమె పోస్ట్‌ చేశారు.  

పూజ ప్రస్తుతం మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో... అల్లరి నరేష్‌, నవీన్‌ చంద్ర, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, సాయి కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

దిల్‌రాజు, అశ్వినిదత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 5న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క ప్రభాస్‌-రాధాకృష్ణ కాంబినేషన్‌లో వస్తోన్న కొత్త సినిమాలోనూ పూజ  హీరోయిన్ గా నటిస్తోంది.