అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. సినీ అభిమానుల్లో, యువతలో కాజల్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ తారల పేరుతో తరచుగా జరుగుతున్న సైబర్ నేరాలని చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాజల్ పేరుతో కొందరు సైబర్ నేరగాళ్లు ధనవంతుడైన ఓ బిజినెస్ మ్యాన్ తనయుడిని పెద్ద మొత్తంలో మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 

తమిళనాడులోని రామాంతపురంకి చెందిన ఓ యువకుడి గత కొన్ని రోజులుగా ఓ వెబ్ సైట్ ని గమనిస్తున్నాడట. ఆ వెబ్ సైట్ లో కొన్ని లింకులు క్లిక్ చేస్తే మరో పేజీకి రీడైరెక్ట్ అవుతున్నాయి. ఆ పేజీలో మీ అభిమాన హీరోయిన్లని ప్రత్యేకంగా కలుసుకునే ఏర్పాటు చేస్తాం అని ఉంది. ఈ యువకుడు కాజల్ అగర్వాల్ ని ఎంచుకున్నాడు. 

ఈ క్రమంలో ఆ వెబ్ సైట్ లో తన వ్యక్తిగత వివరాలని పంచుకున్నాడు. సదరు సైబర్ నేరగాళ్లు ఇతడు ధనవంతుడైన వ్యాపారవేత్త కుమారుడు అని పసిగట్టారు. మొదట ఆన్లైన్ లో 50 వేలు చెల్లించాడు. సదరు సైబర్ నేరగాళ్లు ఇతడి మార్ఫింగ్ ఫోటోలు సిద్ధం చేసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. 

అలా దాదాపు 60 లక్షల వరకు ఆ యువకుడిని నుంచి దోచేశారు. భయాందోళనకు గురైన ఆ యువకుడు కొన్ని రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పోలీసులు అతడిని కనిపెట్టి ఆరా తీయగా జరిగిన మోసాన్ని వివరించాడు. తక్కువ సమయంలోనే ఈ కేసుని చేధించిన పోలీసులు సైబర్ నేరగాళ్ళని అరెస్ట్ చేశారు. ఆన్లైన్ లో కనిపించే ఫేక్ లింకులు, ప్రకటనలతో జాగ్రత్తగా ఉండాలనే విషయం ఈ సంఘటన ద్వారా మరోసారి రుజువైంది.